టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు!

తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా వకుళ మాత అన్నప్రసాద వంటశాలను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం ఆయన వకుళ మాత వంటశాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పద్మావతి అతిథిగృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.  అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పెంచాలని  ఇందుకోసం  ప్రణాళికతో పనిచేయాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు.

 ఇదిలా వుండగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టిటిడి ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది.