నేటి యువత రేపటి సూత్రధారి!
posted on Mar 7, 2024 10:01PM
ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు అవుతారు.
ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు.
అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే.
తేడా!!
చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం.
అంతర్జాతీయ యువ దినోత్సవం!!
ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు.
కార్యక్రమాలు!!
ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు.
యువత కోసం కొన్ని మాటలు!!
స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి.
యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే.
భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.
చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం.
కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.
◆ నిశ్శబ్ద.