చెల్లి రక్ష అన్న బాధ్యత!! అదే రాఖీ పూర్ణిమ అంతరార్థం!

తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు. 

ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు. 

అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు.

రాఖీ పండుగ వెనుక కథనాలు!!

ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం.

ఇంద్రుడి కథ!!

పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు.

దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!!

కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు.

పురుషోత్తముడి కథ!!

అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.

                                   ◆నిశ్శబ్ద.

Related Segment News