విజయం కావాలంటే యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు!
posted on Aug 12, 2022 9:30AM
ఆగష్టు 12న అంతర్జాతీయ యువ దినోత్సం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యువతలో లోపించేది నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. యువత చిన్న చిన్న వాటికి నిరుత్సాహానికి లోనవుతుంటారు. ఏమి చేస్తే విజయం సాధించగలమో, యువతకు చదువు ఎంత అవసరమో, మానసిక పరిణితి ఎలా ఉండాలో తెలుసుకుంటే యువత ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. అందుకే యువతను ఉత్తేజపరిచే వాక్య ప్రవాహంలోకి వెళ్లాలిప్పుడు!!
సమాజంలో మనం ఏదైనా సాధించాలంటే చదువు చాలా అవసరం...! చదువుంటే మనిషికి విలువ కూడా పెరుగుతుంది. విలువ పెరగడం ద్వారా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే విజయసోపానం అవుతుంది. ఎందుకంటే మన అందరికి విజయాలకు తొలిమెట్టు నమ్మకం కాబట్టి!!
ఏ పనైనా చెయ్యగలమనే నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు అవకాశాలను మనమే సృష్టించుకోగలుగుతాము. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం విజేతలు ఎలా కావాలో. ఏం చేస్తే విజయం లభిస్తుందో తెలుస్తుంటుంది. కొన్ని కొన్ని అవకాశాలను మనం వినియోగించుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనం ఓర్పు, మానసిక ధైర్యాన్ని పొందుతాము. విజేత కావాలనుకునే వ్యక్తికి ఓర్పు, మానసిక ధైర్యం చాలా అవసరం. విజయాన్ని సాధించాలి అనే ఆలోచన మనలో వున్నప్పుడు అనుకోకుండా సమయాన్ని సేవ్ చేసుకునే ఒకానొక లక్షణం చేసే మనలో ఏర్పడుతుంది. సమయాన్ని సేవ్ చేయడం అనేది సాధారణమైన విఆహాయం కాదు. విజయం సాధించాలంటే మొదట సమయం ఎంత విలువైనదో అర్థం కావాలి.
మనం పట్టుదలతో ఉన్నప్పుడే విజయం మన సొంతమవుతుంది. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తించబడతాము. ఇక్కడ మంచి వ్యక్తిత్వం అంటే ఏంటి అని ఆలోచన వస్తే సమాజ ఆమోడయిగ్యమైనది మాత్రమే కాదు నైతిక విలువలు కలిగినదే మంచి వ్యక్తిత్వం. ఇది ఉంటే నిరాశావాదాన్ని తరిమికొడుతుంది. ఆ నిరాశావాదం లేకపోతే అపజయం అనే మాట వినబడదు.
ఆశ అనేది మనుష్యుల్లో నమ్మకాన్ని, బాధ్యతలను పెంచుతుంది. మనం బాధ్యతలను స్వీకరించడం ద్వారా కొంత వరకు కొన్ని కొన్ని విషయాలలో అనుభవాన్ని పొందవచ్చు. ఈ అనుభవం అనేది విజయానికి తోడ్పడుతుంది. అలాగే మనం చేసే పనిమీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. నమ్మకం లేకపోతే మనం ఏ పని చేయలేము. పండు కాస్తుంది, లేక పువ్వు పూస్తుంది అన్న నమ్మకం వల్లే మనం మొక్కల్ని నాటుతాము. ఆ నమ్మకమే లేకపోతే మనం మొక్కల్ని కూడా నాటం. మనకు మనం చేసేపని ద్వారా ఫలితం వస్తుంది అన్న భావన వుండడం వల్లనే మనం అన్ని పనులూ చేయగలుగుతున్నాము. ప్రతి మనిషికి లక్ష్యం అనేది వుండాలి. లేకపోతే మనిషి జీవితం నిస్సారంగా వుంటుంది. అందుకే ప్రతీ మనిషి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న లక్ష్యాన్ని ఏకాగ్రతతో సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో కొంతమంది స్నేహితులు ఎదురువుతారు. మనం నిజమైన స్నేహితులను ఎన్నుకోవాలి. అదేవిధంగా మనం ఇతరులకు మంచి స్నేహితులుగా నిలిచిపోవాలి. మనం ఏ విషయంలో కూడా మొహమాట పడకూడదు. మొహమాటపడడం వల్ల కొన్ని కొన్నిసార్లు నష్టపోవలని వస్తుంది.
మన విజయ సాధనలో జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. ప్రతీక్షణం సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడటాన్ని ఇష్టపడాలి, అవిశ్రాంతంగా కృషి చేయాలి. కష్టేఫలి అన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. కష్టంలేకపోతే ఫలితం కూడా లేదు. మనం కష్టపడినప్పుడు ఫలితం లభిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం ఏర్పరచుకున్న మంచి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అందులో మనం మంచినే గ్రహించడానికి ప్రయత్నించాలి. మంచి వల్ల మనలో పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి.
ఏ పనినైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇష్టంతో చేస్తే కష్టాన్ని మర్చిపోవచ్చు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. భయం అనేది మనల్ని వెనుకడుగు వేసేలాగా దోహదపడుతుంది. జీవితం అంటేనే సుఖదు:ఖాలమయం. రెండూ అనుభవించినప్పుడే జీవితం యొక్క విలువ మనకు అర్ధమవుతుంది. ఈ సుఖ దుఃఖాలను అనుభవించే సమయంలో మనకు అహంకారం అనేది పెరిగిపోతుంది. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. అందుకే వినయవిధేయతలే విజయాన్ని నిర్దేశిస్తాయంటారు పెద్దలు. కాబట్టి నమ్మకం నుండి వినయంగా నడుచుకోవడం వైపు యువత ప్రయాణం సాగాలి.
◆నిశ్శబ్ద.