తెలంగాణ‌లో చంద్ర‌బాబు అడుగు.. భయంతో కేసీఆర్ వణుకు!

తెలంగాణ రాజ‌కీయ ముఖచిత్రం మార‌బోతుందా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ‌వైభ‌వం రాబోతోందా? తెలంగాణ గ‌డ్డ‌పై చంద్ర‌బాబు అడుగు పెట్ట‌డంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారా? తెలుగుదేశం ఫామ్‌లోకి వ‌స్తే  రాజ‌కీయంగాఉనికి కోల్పోతామని బీఆర్ఎస్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలంగాణ‌లో తెలుగుదేశం ఓ బలమైన శక్తి.  ఓ వెలుగు వెలిగింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన మొద‌టి ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అభ్య‌ర్థులు ఏకంగా ప‌దిహేను అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించారు. తొలి ఎన్నిక‌ల్లో బొటాబొటీ మెజార్టీతో సీఎం పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్‌  తెలంగాణ‌లోతెలుగుదేశం బలంగా ఉంటే  బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా తెలుగుదేశంలోని కీల‌క నేత‌ల‌ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.   తెలంగాణ‌లో తెలుగుదేశం నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చ‌డంలో కేసీఆర్ స‌ఫ‌ల‌మ‌య్యారు. అయితే, కేసీఆర్ ను ఇప్ప‌టికీ ఓ భ‌యం వెంటాడుతోంది. తెలుగుదేశం నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చినా ఆ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారు. అదే కేసీఆర్ భయం, ఆందోళన. 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ తెలుగుదేశం ప‌గ్గాలను ప్ర‌జాబ‌ల‌మున్న నాయ‌కుడు చేప‌డితే బీఆర్ఎస్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ముప్పు  ఏర్పడుతుందని కేసీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో తెలంగాణ‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అడుగు పెట్ట‌గానే కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారు.  

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ‌లు త‌గులుతున్నాయి. 2014 నుంచి ఏక‌దాటిగా ప‌దేళ్లు సీఎంగా ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ కు 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు షాకిచ్చారు. బీఆర్ఎస్ ని గ‌ద్దెదింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో తెలంగాణ‌ రాష్ట్ర  రెండో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ‌డంలో తెలుగుదేశం పాత్ర‌ కూడా ఉంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. చంద్ర‌బాబు నాయుడు, తెలుగు దేశం పార్టీపై ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ నోరుపారేసుకున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో మొద‌టి నుంచి కేసీఆర్‌ స‌ఖ్య‌త‌గా ఉంటూ వ‌చ్చారు. చంద్ర‌బాబు జైలుకెళ్లిన స‌మ‌యంలో తెలంగాణ‌లో తెలుగుదేశం నేత‌లు, చంద్ర‌బాబు అభిమానులు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న తెలిపేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనుమ‌తివ్వ‌లేదు. కేటీఆర్ సైతం చంద్ర‌బాబు ఏపీలో అరెస్ట్ అయితే.. ఇక్క‌డ మీ ఆందోళ‌న ఏమిటంటూ అహంకార‌పూరిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తెలంగాణ‌లోని తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, చంద్ర‌బాబు అభిమానులు ఏక‌మై 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. త‌ద్వారా ఆ పార్టీ అధికారంలోకి రావ‌డంలో త‌మ‌వంతు పాత్రను పోషించారు. 

తెలంగాణ‌లో కేసీఆర్ అధికారం కోల్పోగా.. ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినిసైతం అక్క‌డి ప్ర‌జ‌లు గ‌ద్దె దింపారు. చంద్ర‌బాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్య‌మ‌ని భావించి..తెలుగుదేశం కూట‌మికి భారీ విజయాన్ని చేకూర్చి పెట్టారు. ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబు, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిలు సీఎంగా ఉన్నారు. రాజ‌కీయంగా కేసీఆర్ కు న‌చ్చ‌ని వ్య‌క్తుల జాబితాలో చంద్ర‌బాబు, రేవంత్ మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌లు చేప‌ట్టిన కొద్దికాలంకే బీఆర్ఎస్ టార్గెట్ గా రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. త‌ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే  ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు  బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాల్లో కేసీఆర్ పై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికితోడు మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎంపీ క‌విత జైలులో ఉన్నారు. అన్ని వైపుల నుంచి ముప్పేట దాడితో కేసీఆర్ స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ‌.. విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్ర‌బాబు తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ తో  చర్చలు జరపడం, అందుకోసం ఆయన స్వయంగా తెలంగాణ గడ్డపైకి రావడం కేసీఆర్ లో వణుకు పుట్టించింది. ఇప్పటికే 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవడానికి వరుస కడుతున్న తరుణంలో రాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న చంద్ర‌బాబు తెలంగాణలో టీడీపీ బ‌లోపేతంపై దృష్టి పెడితే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకమౌతుందని ఖంగారు పడుతున్నారు‌. దీంతో చంద్ర‌బాబు తెలంగాణ‌లో అడుగుపెట్టిన స‌మ‌యం నుంచి ఆయనను ఎవ‌రెవ‌రు క‌లిశారు.. వారిలో బీఆర్ఎస్ సానుభూతిప‌రులు ఎంత‌మంది ఉన్నారనే విష‌యాల‌పై కేసీఆర్ ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌లోపేతం అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన, తెలుగుదేశం క‌లిసి పోటీచేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే జ‌రిగితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు  తెలుగుదేశం భారీగా గండికొట్ట‌డం ఖాయం. దీంతో భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌సిగ‌ట్ట‌డంలో దిట్ట‌గా పేరున్న కేసీఆర్.. తెలుగుదేశం నుంచి  బీఆర్ఎస్ కు ఎదురయ్యే ముప్పును తలచుకుని భయంతో వణికి పోతున్నారు.