కంటే కూతుర్నే కనాలి అనిపించే పథకం 

ఆడపిల్లల పట్ల అనాదిగా వస్తున్నవివక్ష కారణంగా కావచ్చు, కాదంటే, ఇతరత్రా కారణాలే కారణం కావచ్చును.. దేశంలో అమ్మాయిల  జనాభా తగ్గిపోతోంది. బాల బాలికల నిష్పత్తిలో అసమతుల్యత పెరిగి.. పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆడపిల్లలను ఆదుకుని, విద్యావంతులుగా చేసేందుకు, బేటీ బచావో - బేటీ పడావో’ పేరిట ఒక పథకాన్ని ఐదారేళ్ళ క్రితం ప్రవేశ పెట్టారు. ఆ పథకం ఎంత ‘చక్క’ గా పనిచేస్తోందో ఏమో కానీ, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం, సివాయి గూడెం గ్రామా సర్పంచ్, చెరుకూరి ప్రదీప్ కుమార్, మహిళా దినోత్సవం రోజున, ‘కంటే కూతుర్నే కనాలి’ అనిపించేలా, ‘ఆడపిల్లను కనండి ... ఐదు వేల రూపాయలు పొందండి’ అంటూ ఓ మంచి పథకాని ప్రకటించారు. 

ఈ పథకం వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న  చాలా పథకాల కంటే..ఇది నిజంగా దేశంలో మరెక్కడాలేని పథకం. సంక్షేమానికి మా ముఖ్యమంత్రి చాలా పెద్ద పీట వేశారు ... ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేశారు, అని గొప్పలు చెప్పుకునే ఏ ముఖ్యమంత్రి, మంత్రి తమ జేబులోంచి, ఒక్క రూపాయి ఇవ్వరు. ఇంకా ఛాన్స్ చిక్కితే, ఆ వేల లక్షల కోట్ల నుంచి  కొన్ని కోట్లు సొంత జేబులో వేసుకుంటారు. ఇక కింది స్థాయిలో ఎన్నెన్ని నొక్కుళ్ళు ఉంటాయో, ఎంతెంత మనోళ్ళ జేబుల్లోకి పోతుందో ఏమో.. కానీ ప్రదీప్ కుమార్ తాను పదివిలో ఉన్నత వరకు, గ్రామంలో పుట్టిన  ప్రతి ఆడపిల్ల పేరున రూ.5000 వంతున సొంత సొమ్ము పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు.  

మాములుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు రూపంలో సొమ్ములు పంచి సంక్షేమం పేరిట ప్రజాధనం దుర్వ్యయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలు పంచుతున్న సంక్షేమ సొమ్ములు చాలా వరకు ‘మద్యం’ మార్గంలో కొట్టుకు పోతున్నాయి. అందుకే సంక్షేమ పథకాల వలన ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆర్థిక వేత్తలు చెపుతుంటారు. అదెలా ఉన్న మన సివాయిగూడెం సర్పంచ్ చెరుకూరి ప్రదీప్ కుమార్, పోస్టాఫీసులో  ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వలన పుట్టిన బిడ్డ ఉన్నత చదవులకు ఆ సొమ్ము ఉపయోగానికి వస్తుంది.అందుకే చెరుకూరి పథకం ‘బేటీ బచావో ... బేటీ పడావో’ కు ఏమాత్రం తీసుపోని మంచి పథకం అని గ్రామ పెద్దలు చెరుకూరిని అభిందిస్తున్నారు.