కొండపల్లిలో వైసీపీ కుట్రలు... కమిషనర్ కిరికిరిపై కేశినేని ఫైర్
posted on Nov 18, 2021 6:56PM
తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీ కుట్రలకు తెర లేపింది. అడ్డదారుల్లో మున్సిపల్ చైర్మన్ ను కైవసం చేసుకునేందుకు కుతంత్రాలు చేస్తుందని తెలుస్తోంది. బుధవారం విడుదలైన కొండపల్లి మున్సిపల్ ఫలితాల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో హైడ్రామా చోటుచేసుకుంది.
ఈ నెల 22న కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇందుకోసం ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తనకు ఓటు హక్కు కల్పించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. ఎక్స్ అఫీషియో ఓటు కోసం మున్సిపల్ కమిషనర్‌కు ఆయన లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఎంపీ కేశినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాల్సిన మున్సిపల్ కమిషనర్.. ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కేశినేని నిర్ణయం తీసుకున్నారు. కొండపల్లిలో టీడీపీకి ఒక ఓటు అదనంగా మెజారిటీ ఉంది. కమిషనర్ కాలయాపన చేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ నడుమ హోరాహోరీ పోరు సాగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ వైసీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మొత్తం 29 వార్డులు ఉండగా టీడీపీకి 14.. వైసీపీకి 14 వార్డులు దక్కాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిని కరిమికొండ శ్రీలక్ష్మి గెలుపొందారు. అయితే టీడీపీ నేతల ఆహ్వానం మేరకు ఆమె చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నా, ఎంపీ కేశినేని నాని టీడీపీ తరఫున ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది.