నవంబర్ 19.. చరిత్రలో చేదు జ్ఞాపకం.. దివిసీమ ఉప్పెన మానని గాయం..
posted on Nov 19, 2021 7:32AM
నవంబర్ 19. ఈ డేట్ గుర్తుకొస్తే చాలు దివిసీమ గుండె తల్లడిల్లిపోతుంది. కృష్ణా జిల్లా ఉలిక్కిపడుతుంది. గుంటూరు, ప్రకాశంలు అదిరిపడతాయి. 44 ఏళ్ల క్రితం.. 1977 నవంబర్ 19.. దివిసీమకు ఉప్పెన చేసిన గాయం ఇప్పటికీ మాననే లేదు. ఈ తేదీ వచ్చినప్పుడల్లా.. గత చేదు జ్ఞాపకం గుర్తుకొస్తూనే ఉంది. గుండెలను తొలిచేస్తూనే ఉంది. కంట కన్నీరు పెట్టిస్తూనే ఉంది. అదేమైనా చిన్న ప్రమాదమా?.. చరిత్ర చూడని పెను ప్రళయం. ప్రకృతి విలయం. వేలాది మందిని మింగేసిన ఉప్పెన. లక్షలాది పశువులను కబళించిన తుఫాను. అనేక మందిని నిరాశ్రయులను చేసిన విపత్తు.
అది నవంబర్ 19, 1977. శనివారం. కృష్ణాజిల్లాలోని తీరప్రాంతం-దివిసీమ. సముద్రుని జలఖడ్గానికి బలైంది. ఆ రోజు మధ్యాహ్నం. ఆకాశమంతా నల్లని మబ్బులు చుట్టేశాయి. సముద్రంలో చిన్నగా అలజడి.. కాసేపటికే ఉధృతి పెరిగింది.. పెను ఉప్పెనగా మారింది.. సముద్రం మహోగ్రరూపం దాల్చి.. దివిసీమపై విరుచుకుపడింది. గ్రామాలకు గ్రామాలు నామరూపాలు లేకుండా చేసింది. దివిసీమను శవాల దిబ్బగా మార్చేసింది.
200 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. గాలికి వాన తోడైంది. సముద్రుడు ఉప్పొంగాడు. ఉప్పెన విరుచుకుపడింది. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. ఆ గాలి-వాన ఉధృతికి.. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. తలుపులు విరిగిపోయాయి. గోడలు కూలిపోయాయి. డాబా ఇళ్లు మాత్రమే మిగిలాయి. మిగతావన్నీ నేలమట్టం. వరదలో మటుమాయం. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలమయమయ్యాయి.
1977, నవంబర్ 19, శనివారం మధ్యాహ్నం మొదలైన విలయకాండ.. అర్థరాత్రి కూడా కొనసాగింది. ఎటుచూసినా మోకాల్లోతు నీళ్లు. చుట్టూ చిమ్మ చీకటి. వరద ఉధృతికి అనేక మంది కొట్టుకుపోయారు. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకొని శరీరాలు కోసుకుపోయాయి. వరద ముంచేసింది.. చలి చంపేసింది.
దివిసీమ ఉప్పెనలో అధికారికంగా 14,204 మంది చనిపోయారు. అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు వదిలారు. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 4 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయి. లంక గ్రామాల్లో ఎటు చూసినా శవాల కుప్పలే... తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది.
కృష్ణాజిల్లా పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్లదిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లోని వేలాది మంది ప్రాణాలు బలి తీసుకొంది ఆ ఉప్పెన. కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ ఉప్పెన ప్రభావం చూపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి. దాదాపు వంద గ్రామాలు తుపానులో కొట్టుకుపోయాయి. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుపానులో చిక్కుకుని గల్లంతయ్యాయి. సుమారు 172 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అంతటి విషాదాన్ని మిగిల్చిన ఆ కాళరాత్రి.. నవంబర్ 19.. ఈ తేదీ గుర్తుకు వస్తే దివిసీమ వాసులు ఇప్పటికీ ఉలిక్కిపడతారు. కన్నీటిపర్యంతం అవుతారు.
1977, నవంబర్ 19.. క్యాలెండర్‌లో డేట్ మారే సరికి దివిసీమలో అనేక గ్రామాలు కనుమరుగు అయ్యాయి. వేలాది మంది భూమి మీదనే లేకుండా జలసమాధి అయ్యారు. లక్షలాది మంది ఆకలి కేకలు పెట్టారు. నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకోవడానికి అనేక ఆపన్న హస్తాలు ముందుకు వచ్చాయి. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రామకృష్ణ మఠం, ఆర్ఎస్ఎస్ బృందాలు, ప్రపంచస్థాయి సేవా సంస్థలు.. ఉప్పెన బాధితులను ఆదుకున్నాయి. వారికి అండగా నిలిచాయి. నందమూరి తారకరామారావు దివిసీమ బాధితుల కోసం జోలెపట్టి తిరిగారు. పలు గ్రామాలు పునర్-నిర్మించబడ్డాయి. తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలతో ఐదుగురు ఉన్నతాధికారులు పదవులకు రాజీనామా ఇచ్చారు.
అసువులు బాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేటికి దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ విషాదచాయల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు. క్యాలెండర్‌లో నవంబర్ 19 వచ్చిన ప్రతీసారీ దివిసీమ విషాదం గుర్తుకు వస్తూనే ఉంటుంది. దివిసీమ ఉప్పెన. అది చెదరని చేదు జ్ఞాపకం. మానని లోతైన గాయం.