వివేకా హత్య కేసు.. శిక్ష బాధితులకేనా?

వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు. 

తన తండ్రిని హత్య చేసిన  దోషులకు శిక్ష పడాలంటూ వివేకా కుమార్తు డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. వివేకా వర్ధంతి సందర్భంగా సునీత మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ కేసులో ముఖ్య సాక్షులు ఒకరి తరువాత ఒకరు మరణించడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. వివేకా కేసులో నిందుల కంటే బాధితులే ఎక్కవ శిక్ష అనుభవిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఇప్పటికి స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   కేసు ఆంధ్రప్రదేశ్ పరిధిలో లేకపోయినా.. ఇక్కడ ఉన్న సాక్షులను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానిదేనన్న సునీత.. ఆ బాధ్యత నెరవేర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆరోపించారు.  సాక్ష్యులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంటే.. ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.  

గత వైసీపీ ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుకుందనీ, వీలైతే కేసు దర్యాప్తును అటకెక్కించేందుకు ప్రయత్నించిందనీ చెప్పిన సునీత.. ఆ ప్రయత్నాలను తాను న్యాయపోరాటం ద్వారా అడ్డుకున్నాననీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాతైనా న్యాయం జరుగుతుందనుకుంటే.. నిరాశే ఎదురౌతోందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.