వంకర బుద్ధి విమర్శలు ఇకనైనా ఆపండయ్యా!

వైసీపీ తీరు గమనించిన ఎవరికైనా ఆ పార్టీకి పిడుక్కీ బియ్యానికీ ఓకే మంత్రం అన్న మాట స్ఫురిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా ఒకే విధంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులను విమర్శించడానికి ఆ పార్టీకి అంశాలేవీ అవసరం లేదు. ఎందుకు విమర్శిస్తున్నామో తెలియాల్సిన అవసరం కూడా లేదు. మైకు ఉంటే చాలు ప్రత్యర్థి నాయకుల వ్యక్తిగత అంశాలను పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం రివాజుగా మారిపోయింది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ విమర్శలనే తీసుకుంటే.. ఓ పద్ధతీ పాడూ ఉన్నట్లు కనిపిం చదు. ఆ పార్టీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలంతా పవన్  వ్యక్తిత్వ హననమే లక్ష్యం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సమయంలోనూ, ఇప్పుడు అధికారం లేని సమయంలోనూ కూడా పవన్ కల్యాణ్ వివాహాల గురించే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంశాలపై విమర్శించేందుకు వారికి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా దొరక లేదు.

ఇప్పుడు తాజాగా ఆయన కుమార్తె పోలెనా అంజనా పవనోవాపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ తన పెద్ద కుమార్తె ఆద్యతో కలిసి దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గ గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. అయితే వైసీపీయులు మాత్రం పవన్ తన రెండో కుమార్తె పోలెనా అంజనా పవనోవా ఎందుకు రాలేదంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తిరుమలలోలా బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో డిక్లరేషన్ రాజకీయం చేయడానికి అవకాశం లేదు కనుకే ఆమె రాలేదంటూ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో పవన్ రెండో కుమార్తె పోలెనా అంజనా పవనోవా డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించు కున్నారు. అంటే హిందూ ధర్మంపైనా, హిందూ దేవుళ్లపైనా తనకు విశ్వాసం ఉందని ప్రకటించేశారు. ఇక ఆవిషయంలో రాజకీయం చేయడానికి ఏమీ లేదు. అయినా వైసీపీయులు అదే పట్టుకు వేళాడుతున్నారు. ఇప్పుడు అవే ప్రశ్నలను జనసేనాని కానీ జనసైనికులు కానీ జగన్ కు సంధిస్తే సమాధానం ఇచ్చుకోగలరా? డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకే జగన్  ఇటీవల తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా అంగీకరించే ధైర్యం లేక ఇదేనా సెక్యులరిజం అంటే అంటూ ప్రశ్నలు గుప్పించి మొహం చాటేశారు.

అయితే పవన్ కల్యాణ్ మాత్రం అలా కాకుండా తన రెండో కుమార్తె క్రిస్టియన్ కనుక డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీవారి దర్శనం చేసుకుంటుందని చాటి అలాగే చేయించారు. అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే సెక్యులరిజం అంటే అని చాటారు. ఇప్పుడు కూడా పోలెనా అంజనా పవనోవా దర్గమ్మ దర్శనానికి రాకపోవడానికి కారణాలేమిటన్నది తెలియకపోయినా.. నేడు కాకపోతే రేపైనా ఆమెను దుర్గగుడికి పవన్ కల్యాణ్ తీసుకురాగలరు.. అలా తీసుకువచ్చి.. జగన్ కు భారతిని తీసుకురాగలరా అని సవాల్ చేస్తే ఆయన పరిస్థితి ఏమిటి? సమాధానం చెప్పుకోగలరా? వైసీపీయుల విమర్శలు జగన్ ను చిక్కుల్లోకి నెట్టేయవా? అందుకే  ఈ విషయంలో తమ మంచి కోసమైనా వైసీపీయులు నోరు కట్టేసుకుంటే మేలు అని పరిశీలకులు అంటున్నారు.