రతన్ టాటా కన్నుమూత..!

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) తన జీవన పయనాన్ని ముగించారు. ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. డిసెంబర్ 28, 1937న నావల్ టాటా - సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1990వ సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు ఆయన టాటా గ్రూప్‌కి చైర్మన్‌గా ఉన్నారు. 2016 సంవత్సరం అక్టోబర్ నుంచి 2017వ సంవత్సరం ఫిబ్రవరి వరకు ఆయన టాటా గ్రూప్‌కి తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు. న్యూయార్క్.లోని కార్నల్ విశ్వవిద్యాలయం నుంచి రతన్ టాటా బీ-ఆర్క్ పట్టా పొందారు. 2000 సంవత్సరంలో రతన్ టాటా భారతదేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్, 2008 సంవత్సరంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు.

రతన్ టాటా మరణం పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు. ‘‘రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్ఠాత్మక వ్యాపార సంస్థలకు ఆయన స్థిరమైన నాయకత్వం అందజేశారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడు’’ అని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం రతన్ టాటా కృషి చేశారని మోడీ కీర్తించారు. అలాగే, రతన్ టాటా మృతి పట్ల లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం వెలిబుచ్చారు. వ్యాపారం, దానగుణంలో రతన్ టాటా శాశ్వతమైన ముద్ర వేశారని అన్నారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.