కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్!

కెమిస్ట్రీలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు సైంటిస్టులకు ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రకటించారు. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గాను సైంటిస్టులు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్ ఎం.జంపర్‌లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కి గాను బెకర్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కి గాను డెమిస్, జంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

మెడికల్ విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. గురువారం నాడు లిటరేచర్ విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్టోబర్ 14న ఎకనామిక్స్ నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

స్వీటన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, బిజినెస్‌మన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల అమెరికన్ డాలర్లు) నగదు అందుతుంది. ఈ బహుమతులను ఈ ఏడాది డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.