వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. నడిరోడ్డుపై కొట్లాట.. 8 మందికి గాయాలు
posted on May 27, 2020 5:46PM
అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్నటికి నిన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మాటల యుద్ధం మరువక ముందే.. నేడు ద్వితీయ శ్రేణి నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు.
సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చూస్తుండగానే ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి.
కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఓ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ గొడవ చెలరేగింది. ఆ వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామకృష్ణారెడ్డి, యోగానంద్‌రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. మాటవినని వారిపై లాఠీ ఝుళిపించారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.