బ్లీచింగ్, పారాసిటమాల్ అంటూ నిర్లక్ష్యం.. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం
posted on May 27, 2020 2:59PM
టీడీపీ మహానాడు కార్యక్రమంలో మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బ్లీచింగ్ చల్లి, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందంటూ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. చివరికి బ్లీచింగ్ పౌడర్లోనూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో భూమాఫియా రెచ్చిపోతోందన్నారు. తిరుమల, సింహాచలం, విజయవాడ ఆలయాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయల ఆస్తులు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, భవిష్యత్‌లో తగ్గిస్తామని చెప్పామని గుర్తుచేశారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం వంతపాడుతోందని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తరుపున ప్రభుత్వం పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికార అహంకారంతో ఎన్నికల అధికారిని తొలగించారన్నారు. రాజధాని తరలింపు విషయంలో సెలక్ట్ కమిటీపై మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ప్రశ్నించినవారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పీపీఈ కిట్లు అడిగిన డాక్టర్ సుధాకర్‌ను హింసిస్తున్నారన్నారు. మీడియాపై చీకటి జీవో ఇచ్చారని, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.