భానుడి భుగభగలు.. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల పైనే!

తెలుగు రాష్ట్రాలలో భానుడి భుగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉభయ రాష్ట్రాలలోనూ పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైన నమోదౌతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే నిప్పుల కుంపటిగా మారిపోయిందా అన్నట్లుగా ఎండల తీవ్రత ఉంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని   ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. గురువారం జిల్లాలో అత్యథికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్లలో కూడా 41 నుంచి 42 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి చివరి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతుంటే.., ఏప్రిల్, మే నెలలలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో విస్తరించిన ఉన్న సింగరేణి ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.  

ఎండల తీవ్రత నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యవసాయ కూలీలు 12 గంటలలోపు పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలనీ, అలాగే బయటకు వెళ్లేవారు వెళ్లేవారు మజ్జిగ, తాగునీరు వంటి పానియాలను వెంట తీసుకువెళ్లాలనీ సూచిస్తున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు అయితే అత్యవసరమైతే ప్ప బయటకు వెళ్లవద్దని అంటున్నారు. అలాగే వేసవి ఎంత తీవ్రతను తట్టుకోవడానికి వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలనిసూచిస్తున్నారు.  

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని నందనమూరెళ్లలో ఈ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడులో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందనీ, అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్లులు కూడా వీస్తాయనీ వాతావరణ శాఖ పేర్కొంది.