కేసినేని నానికి వైసీపీ గాలం..?

క్రికెట్ లో ఎవరు విజేతలు అవుతారో..  రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో  చెప్పడం జూదంలాంటిదేనని అంటారు.  అంచనాలు ఒక్కొక్కసారి నిజమవుతాయి..మరోసారి ఫెయిల్ అవు తాయి. మరీ ముఖ్యంగా రాజకీయాలలో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. అంటే రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని అర్ధం. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీని వైసీపీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని అధికార పార్టీ రాజ్యసభ  సభ్యుడు అయోధ్య రామిరెడ్డి  వ్యాఖ్యలతో తెలుగుదేశం వైసీపీ పార్టీల్లో కలకలం రేగింది.  

అసలు కేశినేని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారన్న చర్చ కూడా ఎక్కడా జరగడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పట్ల కించింత్ అసంతృప్తితో ఉన్నారన్నది తెలిసిందే. ఆ ఈసంతృప్తితో కేశినేని నాని ఒక వేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినా  వైసీపీ లో చేరుతారని ఎవరూ కూడా ఊహామాత్రంగానే  భావించలేదు. దీంతో  అయోధ్య రామిరెడ్డి కేశినేని నానిని వైసీపీలోకి ఆహ్వానిస్తాం అనడం కేవలం తెలుగుదేశం, వైసీపీలలోనే కాదు అందరిలోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.  

2019-20 ల కాలంలో... కేశినేని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరుతారనే ప్రచారం జరిగింది. దాన్ని ఆయన ఖండించారు కూడా. అప్పటి నుంచి పార్టీ మారే విషయంలో ఎంపీ పై ఎలాంటి వార్తలు లేవు. అయితే  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తో ఎంపీ కి మంచి సంబంధాలు లేవన్నది వాస్తవం. ఎందుకంటే ఎంపీ ఏ రోజు ఎలా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఎంపీని బలంగా వ్యాతిరేకిస్తున్న బోండా ఉమ,  బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, జలీల్ ఖాన్ లాంటి నేతలను చంద్రబాబు కట్టడి చేయటం లేదు.

ఇదే సమయంలో ఎంపీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అంటే ఈ  రెండువర్గాల్లోని  నేతలు ఎవరికి  వ్యతిరేకంగా ఎవరు ఫిర్యాదు  చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. ఎందుకంటే విజయవాడ లో ఈ రెండు వర్గాల నేతలూ పార్టీకి అవసరమే. వీళ్ళ మధ్య పంచాయితీల పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంతో చంద్రబాబు కూడా వీళ్ళని అలా వదిలేశారని భావించాలి. అయితే రాజకీయ పరిణామాల్లో ముందు జాగ్రత్తగా కేశినేని తమ్ముడు కేశినేని శివధర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారనే  ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే అది  కేవలం ప్రచారమే అని కేశినాని నాని పట్టించుకోకుండా వదిలేయడానికి వీల్లేకుండా, నిదర్శనాలు కూడా కనిపిస్తున్నాయి.  

ఈ పరిణామాల నేపథ్యంలోనూ  కేశినేని నాని అధికార పార్టీ కి చెందిన వారితో సఖ్యతగా ఉంటున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే  మొండితోక జగన్మోహన్ రావుతో  సన్నిహితంగా మెలుగుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పిలిస్తే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని పార్టీలో కి వస్తే ఆహ్వానిస్తామని అయోధ్య రామిరెడ్డి  చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.   గత రెండు ఎన్నికలలోనూ విజయవాడ పార్లమెంటు స్థానంలో వైసీపీ పరాజయం పాలైంది. కాబట్టి సహజంగానే  బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ గాలిస్తోంది. ఆ బలమైన అభ్యర్థి ఆ పార్టీకి కేశినేని నాని రూపంలో లభించాడని అయోధ్యరామిరెడ్డి వ్యాఖ్యలు చెబుతున్నాయి. దీనిని బట్టి   కేశినేని తొందరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.