మరో ‘మహా ’ సంక్షోభం ?

మహారాష్ట్రలో రాజకీయం మరో మారు వేడెక్కింది. గతేడాది ఇదే జూన్ నెలలో  అప్పటి అధికార కూటమి మహా వికాస్ అఘాడి లో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మూడు పార్టీల కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేన నిట్టనిలువునా చీలి పోవడంతో ఏర్పడిన సంక్షోభం చివరకు కూటమి సర్కార్  కూలి బీజేపీ, శివసేన చీలిక వర్గం ( షిండే వర్గం) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీసింది. శివసేన చీలిక వర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫన్డవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నెల రోజులకు పైగా సాగిన మహా సంక్షోభం గత సంవత్సరం జూన్ 30 న ముగిసింది.  

అయితే సంక్షోభం మూగిసి సంవత్సరం దాటినా మహా రాజకీయాల్లో వేడి మాత్రం తరచూ తెరపైకి వస్తూనే వుంది. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్  పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి  ఉప సంహరించుకున్న ఎపిసోడ్ ముగిసిన కొద్ది రోజులకే, మరో మహా రాజకీయం తెరపై కొచ్చింది. శివసేన చీలిక వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారంతా మాతృ సంస్థకు తిరిగోస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ వినాయక్ రౌత్ పేర్కొన్నారు. అలాగే, 13 మంది ఎంపీల్లో 9 మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన బాంబు పేల్చారు.  షిండే సేనలోని ఎంపీలు కూడా తమ పనులు జరగడం లేదని,  తమను ధిక్కరిస్తున్నారని కలత చెందారని రౌత్ అన్నారు.

ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ తమ పట్ల బీజేపీ సవతి తల్లిగా వ్యవహరిస్తోందని షిండే గ్రూపు ఎంపీ గజానన్ కీర్తికర్ అసమ్మతి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర మంత్రి శంభురాజే దేశాయ్ 15 రోజుల కిందట ఉద్ధవ్ ఠాక్రేకు ఒక సందేశం పంపారని, వారు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే దాని గురించి మాట్లాడారని రౌత్ చెప్పారు. కేవలం దేశాయ్ మాత్రమే కాదు తానాజీ సావంత్, గజానన్ కీర్తికర్ తమ అసంతృప్తి వెళ్లగక్కారని గుర్తు చేశారు. షిండే సేన తన మిత్రపక్షమైన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలపై కలవరపడుతోందని వ్యాఖ్యానించారు.

అయితే  దీనిపై స్పందించిన దేశాయ్.. తాను ఉద్ధవ్‌కు ఎటువంటి మెసేజ్ పెట్టలేదన్నారు. రౌత్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు.  వినాయక్ రౌత్ వ్యాఖ్యలపై రెండు రోజుల సమయం ఇస్తున్నా.. రౌత్ తన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.. పరువు నష్టం నోటీసులు పంపుతాను  అని మంత్రి స్పష్టం చేశారు. అయితే, మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు  దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.