ఓటమి తరువాత నెల రోజులకే వైసీపీ ఖాళీ.. సీఎం రమేష్ జోస్యం

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. సరే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రుల నుంచి ఇక్కడి తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ సహకారం అందకుండా నిలువరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనీ, ఇందు కోసం తెలంగాణలోని ఆంధ్రులపై ఆయన సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించారనీ కూడా అప్పట్లో చెప్పుకున్నారు. సరే అది పక్కన పెడితే..

జగన్ సైతం తన మిత్రుడికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇతోధిక సహకారం అందించారు. లేని సెంటిమెంటును రెచ్చగొట్టైనా మిత్రుడు కేసీఆర్ ను గట్టెక్కించాలని జగన్ ప్రయత్నించారు. ఎన్నికల రోజుకు సరిగ్గా ముందు రోజు అర్ధరాత్రి సాగర్ వద్ద ఏపీ పోలీసులతో హంగామా చేయించారు. అయితే అవేమీ ఫలించలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ రోజు రోజుకూ బక్కచిక్కిపోతున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీలలోకి వలసలు పెరిగిపోయాయి. పోతే పోనీ అని బీఆర్ఎస్ అధినేత డాంబికంగా చెబుతున్నప్పటికీ.. వలసల ఉధృతి చూస్తుంటే లోక్ సభ ఎన్నికల తరువాత ఆ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. సిట్టింగులు, మాజీలే కాదు, ద్వితీయ శ్రేణి నేతలూ, చివరాఖరికి పార్టీ క్యాడరూ కూడా కారు దిగిపోవడానికి తహతహలాడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. 

ఇదే విషయాన్ని బీజేపీ నేత, ఆ పార్టీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ ఎత్తి చూపుతూ.. ఏపీలో జగన్  ఓటమి తరువాత వైసీపీకీ అదే గతి పడుతుందన్నారు. అంతే కాదు బీఆర్ఎస్ కంటే వేగంగా వైసీపీయే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం రమేష్ జగన్ అధికారం కోల్పోయిన తరువాత కనీసం నెల రోులు కూడా ఆ పార్టీ మనుగడ సాగించ లేదనీ, చాలా వేగంగా జారుడుబండ మీద నుంచి జారినట్లు ఆ పార్టీ నుంచి నేతలు జారిపోతారని రమేష్ అన్నారు. కనీసం బీఆర్ఎస్ నేతలు వలసల విషయంలో కొంత సమయం తీసుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అంత టైమ్ జగన్ కు ఇవ్వరన్నారు.   

నిజమే.. పేరుకే ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో మాత్రం పెత్తనమంతా వాలంటీర్లదే. ఆ పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురైన ఎమ్మెల్యేలకు జగన్ పట్ల విధేయత, విశ్వసనీయత ఉండే అవకాశం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికే జగన్ పట్ల పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోందనీ, ఓటమి తరువాత అది తిరుగుబాటు స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనీ అంటున్నారు.