విజయవాడ, విశాఖపట్నంలలో డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో!
posted on Jan 3, 2025 2:10PM
ఆధునికత, సృజనాత్మకత, ప్రజా ప్రయోజనం, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఇవీ.. చంద్రబాబు పాలనకు ట్రేడ్ మార్కులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన అలాగే సాగింది. ఆ తరువాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పాలన అదే బాటలో సాగింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఆయన ఆధునికత, సాంకేతికతల మేళవింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు నిర్ణయించి, అందు కోసం కసరత్తు ప్రారంభించేశారు. అందులో భాగంగానే విజయవాడలో రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి నిడమానూరు వరకూ 4.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా ప్రతిపాదించిన డిజైన్లకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. డబుల్ డెక్కర్ మోడల్ అంటే కింద రోడ్డు, పైన ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో రైల్ లైన్ అన్న మాట. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని ప్రాంతాలలో మెట్రో రైల్ నడుస్తుందన్న మాట. ఈ మోడల్ ప్రకారం రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఫ్లై ఓవర్ ఉంటుంది. దానికి ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ ఉంటుందన్న మాట. ఫ్లై ఓవర్ దాటిన తరువాత మెట్రో రైల్ ట్రాక్ పది మీటర్ల ఎత్తులోనే ఉంటుంది.
ఇదే మోడల్ ను విశాఖలోనూ అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్ల పాలెం వరకూ, అలాగే గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ మొత్తం 19 కిలోమీటర్ల పోడవున మెట్రో ప్రాజెక్టుకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఇక ఈ రెండు నగరాలలోనూ మెట్రో ప్రాజెక్టు వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.