గెలిస్తేనే సచివాలయం.. ఓడితే ఫామ్ హౌస్ లో రెస్టే.. ఎప్పుడో చెప్పిన కేసీఆర్!

గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ బీఆర్ఎస్ అధినేత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన క్రీయాశీలంగా లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బలహీనపడింది. ఆ పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది. అయితే కేసీఆర్ అధికారంలో ఉండగా  వాగ్దానాలను ఏ మేరకు నిలబెట్టుకున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

అయితే గత ఎన్నికలకు ముందు ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఉంటా... ఓడితే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని విస్పష్టంగా చెప్పారు. ఆ మాటకే కట్టుబడి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అధికారంలో ఉంటేనే ప్రజా జీవితంలో ఉంటాననీ, లేకుంటే రెస్టు తీసుకుంటాననీ ఆయన ఎన్నికలకు ముందే విస్పష్టంగా చెప్పేశారు. ఆ మాట మీదే నిలబడ్డారు. నిలబడుతున్నారు. ఇందులో ఆయనను తప్పుపట్టాల్సిన పని లేదని పరిశీలకులు అంటున్నారు.  ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావం తరువాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆయా ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తాను అన్న హామీ నుంచి భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి వరకూ ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే వాటి అమలును ఎన్నడూ పట్టించుకోలేదు. మాట ఇవ్వడం, మాట తప్పడం కేసీఆర్ కు అలవాటే అన్న భావన తెలంగాణ సమాజంలో పాతుకుపోయింది.  

అలా కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడతాను అని నిరూపించాలని కేసీఆర్ భావించారో ఏమో.. పార్టీ ఓటమి తరువాత ఆయన చెప్పిన విధంగా ఫామ్ హౌస్ కే పరిమితమై రెస్టు తీసుకుంటున్నారు.  గత 13 నెలలుగా రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ వానప్రస్థంలో గడుపుతున్నట్లు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.    ప్రత్యేక తెలంగాణా డిమాండును నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశన సందర్భంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. నిజానికి మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్ రెండేళ్ళు కార్మిక మంత్రిగా పని చేశారు. అందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై సంతాప తీర్మానంపై మాట్లాడతారని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి బయటకు రాలేదు.  

కేసీఆర్ తీరు కారణంగానే  ఇప్పుడు బీఆర్ఎస్ చీలికలు పేలికలుగా మారిపోయే పరిస్ధితిలో ఉంది. కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్యా పార్టీ పగ్గాల కోసం అంతర్గత పోరు జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్యాడర్ అయితే కేటీఆర్, కవితల మధ్య నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మొత్తం మీద అధికారంలో ఉండగా సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. అధికారం పోయిన తరువాత రాష్ట్రాన్ని, ప్రజలను, చివరకు పార్టీనీ కూడా పట్టించుకోకుండా మౌనంగా ఉండటం ఆయన ప్రతిష్టను మసకబారుస్తోందనడంలో సందేహం లేదు.