పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ శ్రేణుల అరాచకం.. దీటుగా సమాధానమిచ్చిన ఓటర్లు
posted on May 14, 2024 6:53AM
వైసీపీ ప్రభుత్వం దిగిపోవటం ఖాయమైంది. ఐదేళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత, అరాచక పాలనకు విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓటు ద్వారా వీడ్కోలు పలికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భయాందోళనకు గురిచేసినా, పలు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెదరకుండా, అదరకుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వద్దకు ఓటర్లు పోటెత్తారు. రాత్రి పొద్దుపోయే వరకు మహిళలు, యువతులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కంకణం కట్టుకొని మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉండటంతో ఓటమి ఖాయమని ముందే ఊహించిన వైసీపీ గ్యాంగ్ పోలింగ్ ఎక్కువ శాతం నమోదు కాకుండా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. పోలింగ్ ప్రారంభం నుంచి గొడవలు సృష్టించడం మొదలు పెట్టారు. టీడీపీ నేతల వాహనాలపై దాడులు, పోలింగ్ బూత్ సందర్శనకు వచ్చిన టీడీపీ నేతలను అడ్డుకోవటం, కూటమి తరపున పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్లను కిడ్నాప్ లు, దాడులు చేయడం ద్వారా భయానక వాతావరణంను సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ, జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఓటర్లు వైసీపీ కుట్రలను తిప్పికొట్టి పోలింగ్ కేంద్రాల వద్ద గంటల కొద్దీ కూలైన్లలో నిల్చొని మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి 11 గంటలకు వరకు పలు పోలింగ్ కేంద్రాల్లో కూలైన్లు కనిపించాయి. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి రాత్రి వరకు వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకోవటంలో పోలీసులు విఫలమయ్యారు. ఉదయం నుంచి వైసీపీ నేతలు ఘర్షణలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు అలర్ట్ కాకపోగా పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలకు కొందరు పోలీసులు మద్దతుగా నిలిచారు.
వైసీపీ పార్టీని ఓటమి భయం ఎంతలా వెంటాడిందంటే తెనాలి ఘటన ప్రధాన ఉదాహరణ. క్యూలైన్ లో వచ్చి ఓటు వేయాలని ప్రశ్నించినందుకు తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నబత్తుని శివ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. సహనం కోల్పోయి ఓటరు పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడి ప్రజలు శివకుమార్ పై తిరబడ్డారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతో సహనం కోల్పోయి వైసీపీ నేతలు ఓటర్లపై దాడులు చేయడం ఉదయం నుంచి రాత్రి వరకు సాగాయి. కడప జిల్లాలోనూ వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. కడప నగరంలోని గౌస్ నగర్ లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నం చేయగా ఘర్షణ జరిగింది. దీంతో వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగి ఓట్లర్లను, టీడీపీ కార్యకర్తలను భయ బ్రాంతులకు గురిచేశారు. ఒంగోలులో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు యత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు.. దీంతో మాజీ మంత్రి బాలినేని కోడలు శ్రీకావ్య ఆధ్వర్యంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ అల్లరిమూకలు దాడులకు దిగారు. అదే విధంగా మన్యం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో ఎస్సీలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇళ్లలోకి చొరబడి కర్రలు, రాళ్లతో వైసీపీ శ్రేణులు దాడులకు దిగారు. ప్రకాశం జిల్లాలో వీరభద్రపురంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలింగ్ బూత్ వద్ద బెదిరింపులకు దిగాడు. పోలింగ్ అధికారులపైనా బెదిరింపులకు పాల్పడి పోలింగ్ తమకు అనుకూలంగా జరిగేలా విశ్వప్రయత్నాలు చేశారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. తంగెడలో నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులకు తెగబడ్డారు. దీంతో భయాందోళనతో పోలింగ్ కేంద్రం నుంచి ఓటర్లు పరుగులు తీశారు. నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని ట్రైనీ కలెక్టర్ చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ మూకలు శ్రీకృష్ణ దేవరాయలు కాన్వాయ్ పై రాళ్లదాడి చేశాయి. అదే విధంగా అంబటి రాంబాబు అనుచరులు వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్ ల వద్ద ఘర్షణలు సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. నర్సరావుపేట పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు హల్ చల్ చేశాయి. చదలవాడ కారుపై దాడికి దిగాయి. పెనమలూరు నియోజకవర్గంలోనూ వైసీపీ శ్రేణులు పేట్రేగిపోయాయి. దొంగ ఓట్లు వేసేవారిని టీడీపీ నేతలు అడ్డుకోవటంతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ ఓటమి భయంతో పోరంకి ఎన్నికల బూత్‌ల వద్ద వారి అనుచరులతో అలజడి సృష్టించి పోలింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఓటర్లు మాత్రం ఘర్షణలకు భయపడకుండా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల అరాచకాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 120కిపైగా ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయని, వైసీపీ మూకలు పోలింగ్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఈసీకి లేఖ రాశారు. పలు ప్రాంతాల్లో పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టారు. కొందరు పోలీసులు కావాలని వైసీపీకి మద్దతు పనిచేశారని ఈసీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలోనూ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న పరిస్థితి తలెత్తింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొందరు పోలీసుల అండతో తెలుగుదేశం నేతలపై దాడులకు యత్నించారు. తెలుగుదేశం శ్రేణులు ఎదురుతిరగడంతో పోలీసులు రంగంలోకిదిగి ఘర్షణలు తలెత్తకుండా అడ్డుకున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం నేతలపై దాడులకు దిగారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లెలో తెలుగుదేశం ఏజెంట్లపై వైసీపీ మూకలు రాళ్లదాడికి దిగాయి. అదేవిధంగా మాచర్లలోని పోలింగ్ ఏజెంట్లపైనా వైసీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. కడప జిల్లాలో తెలుగుదేశం ఏజెంట్ పైనా వైసీపీ గూండాలు దాడి చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దాడులతో పోలింగ్ భారీగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు రాత్రి 11గంటల దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో వైసీపీ పెద్దలు ఓటమి ఖాయమనే భావనకు వచ్చేశారు. మొత్తానికి ఐదుళ్లుగా అరాచక పాలనను కొనసాగించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్ల ఉత్సాహంతో గద్దెదిగడం ఖాయమని తేలిపోయింది.