2004 లో జగన్ ఆస్తుల విలువ రూ.36 లక్షలే
posted on May 29, 2012 12:01PM
ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కడప ఎంపీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆర్థికంగా ఎదిగిన తీరు అనేక మందికి విస్మయాన్ని కలిగిస్తోంది. 2003-2004 లో ఆదాయపన్ను శాఖకు సమర్పించిన వివరాల్లో ఆయన తన ఆస్తుల విలువ కేవలం రూ,36లక్షలు అని ప్రకటించారు. అయితే 2011 లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా తన ఆస్తుల విలువ 365కోట్ల రూపాయలుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే ఆయన ఆస్తుల విలువ ప్రకటించిన దాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువే ఉంది. 2003-2010 మధ్యన జగన్ 36 కంపెనీలను ప్రారంభించారు. వీటిలో అత్యధికం బూటకపు కంపెనీలే. తన తండ్రి అధికారంలో ఉండగా, అమలు చేసిన తీసుకో - ఇచ్చుకో (క్రిడ్ ప్రోకో) విధానం ద్వారా వచ్చిన వందలాది కోట్ల రూపాయల అక్రమనిదులతో జగన్ ఈ కంపెనీలను ఏర్పాటు చేశారు.
అక్రమార్జనాలు, అక్రమపెట్టుబడుల విషయంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి కొత్త కొత్త పథకాలను అవలంభించారు. వీరు అనుసరించిన పద్ధతులు సిబీఐ వంటి నేరవిచారణసంస్థలకు, పెద్ద పెద్ద ఆడిటర్లకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎక్కడా లంచాలు తీసుకోకుండానే ఇన్ని ఆస్తులు కూడబెట్టడం విశేషం. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థకు అడ్డగోలుగా ఏదైనా సహాయం చేయటం, దానికోసం అవసరమైతే జీ.వో.లను సవరించటం, అందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తులు, లేదా సంస్థల నుంచి కొంతమోట్టాన్ని పెట్టుబడులుగా తీసుకోవటం జరిగింది. ఈ అక్రమాలపై సిబీఐ కేసులు పెట్టినా భవిష్యత్తులో అవి న్యాయస్థానాల్లో నిలబడకపోవచ్చు. కానీ, జగన్ కు విదేశాల నుంచి వచ్చిన అక్రమాస్తుల కేసులు మాత్రం గట్టిగానే ఉంటాయని, ఈ కేసుల్లో జగన్ శిక్ష అనుభవించకతప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.