జగన్ కు అండగా నిలుస్తున్న కమలనాథులు?
posted on May 29, 2012 11:54AM
ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డికి అనూహ్యంగా బిజెపి మద్దతు లభించింది. జగన్ అరెస్టు, సిబీఐ దర్యాప్తు తీరును జాతీయస్థాయిలో ఒక్క బిజెపి మాత్రమే నిర్భయంగా ఖండించింది. సమాజ్ వాడీ పార్టీ, బీజూ జనతాదళ్ వంటి పార్టీలకు జగన్ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇవ్వటానికి సంకోచించాయి. కానీ, బిజెపి మాత్రం జగన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకే సిబీఐ నడుచుకుంటోందని, ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించటానికి సిబీఐ ను ఒక అస్త్రంగా వాడుకుంటోందని బిజెపి జాతీయ ప్రతినిథి రాజీవ్ ప్రతాప్ ఆరోపించారు.
నిజానికి జగన్మోహనరెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వెంటనే బిజెపి నాయకులు జగన్ కు స్నేహహస్తం అందించారు. జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గాలి జనార్థనరెడ్డి కుటుంబం బిజెపిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ తో జతకట్టి తన బలం పెంచుకోవాలని బిజెపి భావించింది. అయితే అనూహ్యంగా గాలి సోదరులు వివాదాల్లో చిక్కుకోవటంతో జగన్ కూడా బిజెపి పట్ల ఆసక్తి కోల్పోయారు. రాష్ట్రంలో టి.ఆర్.ఎస్.తో జతకట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే జగన్ అరెస్టు నేపథ్యంలో టి.ఆర్.ఎస్. వైఖరిలో మార్పు వచ్చింది. ఇడి గమనించిన బిజెపి తానంతట తానుగా సిబీఐను విమర్శించే సాకుతో జగన్ కు దగ్గరకావటానికి ప్రయత్నిస్తోంది. జగన్ కూడా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపితో కలిసి పని చేయటానికి సిద్ధపడవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.