జైలులో జగన్ చిక్కుల్లో కాంగ్రెస్, టిడిపి
posted on May 29, 2012 12:27PM
జగన్మోహనరెడ్డి అరెస్టు కాంగ్రెస్, టిడిపిల్లోని కొందరు నాయకులకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీల అగ్రనేతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జగన్ అరెస్టు ప్రభావం ఉప ఎన్నికలపై స్పష్టంగా ఉంటుంది. అత్యధికస్థానాల్లో జగన్ పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నట్లు ఇటీవల సర్వేల్లో తేలింది. దీనికి తోడు జగన్ అరెస్టు, విజయమ్మ ఎన్నికల ప్రచారం కారణంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి మరింత మద్దతు పెరిగే అవకాశముంటుందని, కాంగ్రెస్, టిడిపిల్లోని అగ్రనేతలు భయపడుతున్నారు. సానుభూతి పవనాలు బలంగా వీస్తే తమ అభ్యర్థులకు డిపాజిట్లు రావటమూ కష్టమేనని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఉప ఎన్నికల తరువాత తెలుగుదేశంపార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
కిరణ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం వద్దంటే వినకుండా పెట్టారని, అది ఇప్పుడు టిడిపికి నష్టం కలిగించేదిగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. ఈ అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతుదార్లయిన 18 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వటంతో వారిపై అనర్హత వేటు పడింది. ఫలితంగా ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలోని అగ్రనాయకులు కూడా ఎన్నికల ఫలితాలపై ఆందోళన చెందుతున్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమపథకాలనే జగన్ తన ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్ అరెస్టును అక్రమమైనదిగా చూపిస్తూ విజయమ్మ ప్రచారంలోకి దిగితే తమకు మరింత నష్టమని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.