విశాఖకు తరలడానికి ఐఏఎస్ లు ససేమిరా!?

జగన్ విశాఖ నుంచి పాలన అని ఏ ముహూర్తాన అన్నారో కానీ.. అందుకు పెట్టిన ప్రతి ముహూర్తం వాయిదా పడుతూనే ఉంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించైనా సరే ఏదో విధంగా విశాఖ నుంచి పాలన ఆరంభించి పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న జగన్ కు అడుగడుగునా అవాంతరాలే ఎదురౌతున్నాయి. చివరకు అన్నీ అధిగమించి ఇక విశాఖకు తరలిపోవడమే ఖాయమని భావించిన జగన్ కు కేంద్ర సర్వీసు అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు. విశాఖకు తరలిరావడానికి విముఖత వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ కు అది విరుద్ధమంటూ కుండబద్దలు కొట్టేశారు. ఫలానా తేదీన విశాఖకు రావాలని అని చెబితే వస్తాం.. అక్కడ పని అయిపోగానే తిరిగి అమరావతికి తిరిగి వచ్చేస్తాం. అంతే కానీ పర్మనెంట్ గా విశాఖలో మకాం అంటే మాత్రం మేం ఒప్పం అని తెగేసి చెప్పారు.
ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది చాలా ముఖ్యమైన అంశమనీ, దానికి సంబంధించి విస్పష్టమైన ఉత్తర్వులు లేకుండా విశాఖలో క్యాంప్ ఆపీస్ ఏర్పాటు చేసుకోవడం కుదరని పని అని తేల్చేశారు. 

దీంతో విశాఖకు రాజధానిని తరలించి అక్కడే మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇందు కోసం అక్కడ భవనాలను కూడా కేటాయించిన ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైనట్లైంది. విశాఖలో ఐటీ  కంపెనీలకు నెలవు అయిన మిలీనియం టవర్లను యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించి, ఆ కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను వేరే రాష్ట్రాలకు తరలించుకునేలా చేసిన జగన్ సర్కార్ కు ఇప్పుడు వ్రంతం చెడ్డా ఫలం దక్కకుండా పోయింది. 
విశాఖకు తరలే విషయంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ కు తమ అభ్యంతరాలు, సందేహాలను ఏకరవు పెట్టడమే కాదు, విశాఖకు రావడం కుదరదని ముఖం మీదే చెప్పేశారని విశ్వసనీయంగా తెలిసింది. కాకపోతే.. మీరు ఫలానా తేదీన విశాఖలో సమావేశం ఉందనో, మరో పని ఉందనో చెబితే ఆ రోజుకు విశాఖకు వస్తామే తప్ప అక్కడే మకాం అంటే అది కుదిరేపని కాదని విస్పష్టంగా చెప్పేశారని అంటున్నారు.  

ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వైసీపీ సర్కార్ హడావుడి చేస్తుంటే అధికారులు మాత్రం అది సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. దీంతో  జగన్ విశాఖ పాలనపై మళ్లీ అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి.  వచ్చే నెల   8 నుంచి విశాఖ కేంద్రంగా ఇని ఇప్పటికే ప్రకటించేసిన జగన్ ఆ తేదీ నాటికి ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే బాబూస్ మాత్రం బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా విశాఖకు తరలి వచ్చే ప్రశక్తేలేని భీష్మించడంతో డిసెంబర్ 8 ముహూర్తం ప్రకారం విశాఖ నుంచి పాలన ఆరంభమయ్యే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్‌ నోటిఫై చేయకుండా శాఖల్ని తరలించడం సాధ్యం కాదని ఐఏఎస్ అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, ఈ విషయంలో సీఎస్ కు నిలదీయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని చెబుతున్నారు.  

అమరావతి నుంచి విశాఖకు శాఖల కార్యాలయాలను తరలించాలని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తుంటే అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు.  ప్లేస్ ఆఫ్ వర్క్‌ను మార్చేందుకు స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తేనే తాము కదులుతామని విస్పష్టంగా చెబుతున్నారు.  నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలకు, ఉన్నతాధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది కీలకమైన అంశమనీ, దీనిని ఇష్టారీతిగా మార్చేయడానికీ ఎంతమాత్రం వీలుండదని చెబుతున్నారు.   
ఈ నేపథ్యంలోనే   సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు నివేదిక ఇవ్వడాన్నే తప్పుపడుతున్నారు.