కేటీఆర్ కు సీఎం యోగం ఉందా? లేదా?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడెవరు అంటే ఇంకెవరు ఆయన కుమారుడు కేటీఆర్ అని చెబుతారు. అసలు 2018 ఎన్నికలకు ముందే ఆయన పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని వార్తలు వచ్చాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ను ప్రకటించిన సందర్భంలోనే తదుపరి సీఎం కేటీఆర్ అని అందరికీ అర్థమైపోయింది.

 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం ఇహ ఇప్పుడో, అప్పుడో అన్న స్థాయిలో వార్తలొచ్చాయి.  పలు ముహూర్తాలు  కూడా  ఖరారు చేస్తూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి.  మంత్రులైతే బహిరంగ వేదికల నుంచి  కేటీఆర్’ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అకుటుంబ కలహాలా, మరో కారణమా తెలియదు కానీ.. ఇప్పటి వరకూ కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రం జరగలేదు.

ఇప్పుడు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినబడుతోంది. అయితే తొమ్మిదేళ్ల పాలనలో మూటగట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఈ సారి బీఆర్ఎస్ కు విజయం అంత సులభంగా అందే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా.. రాదా అని పక్కన పెడితే పార్టీ వేదికలపై ఎక్కడా ఎవరూ కూడా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించే ధైర్యం చేయడం లేదు. ఎవరు మాట్లాడినా ఆఖరికి కేటీఆర్ కూడా 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది.. కేసీఆర్ ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే అంటున్నారు.

చివరాఖరికి గతంలో  కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్  అని పబ్లిక్ గా బహిరంగ సభలలో చెప్పిన నాయకులు కూడా కేసీఆర్ హ్యాట్రిక్ గురించే మాట్లాడుతున్నారు.  దీంతో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు ఇప్పటికిప్పుడైతే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.  అసలు కేసీఆర్ జాతీయ ఆకాంక్షల వెనుక ఉన్న ఉద్దేశమే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కేటీఆర్ కు అప్పగించేందుకే అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

అయితే విఘ్నేశ్వరుడి పెళ్లికి వేయి విఘ్నాలు అన్న చందంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పెంచుకున్న ఆశలు నెరవేరే అవకాశాలు ఇసుమంతైనా కనిపించని పరిస్థితుల్లో కేటీఆర్ కు తెలంగాణ సీఎం పీఠం అందని ద్రాక్షగా మిగిలిపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని ఆ కుర్చీనీ, బాధ్యతలను తనయుడికి అప్పగిస్తారని పార్టీ వర్గాలు అప్పట్లో గట్టిగా చెప్పాయి. అలాగే కేటీఆర్ డిఫ్యాక్టో సీఎంగా  వ్యవహరించడం కూడా అప్పటి నుంచే మొదలైంది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది అది వేరే విషయం.

కానీ ఆ వ్యూహం కార్యరూపం దాల్చక పోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతంగా నిర్వహించిన ఓ సర్వేయే కారణమని చెబుతున్నారు. బీఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకతకు అత్యథికంగా వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన కారణమని తేలడమేనంటారు. అంతే కాకుండా ఎన్నికల వ్యూహకర్త పీకే కూడా కేటీఆర్ ను వారసుడిగా చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని, అది వచ్చే ఎన్నికలలో పార్టీ విజయావకాశాలను గట్టిగా దెబ్బతీస్తుందని చెప్పడమే కారణమని విశ్లేషకులు అంటున్నారు.  

ఆ కారణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్  కుటుంబం నుంచి ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించకడానికి ససేమిరా అంటున్నారని చెబుతున్నారు.  ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించినా కేటీఆర్ కు సీఎం పగ్గాలు దక్కే అవకాశాలు పెద్దగా లేవనీ అందుకు కారణం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పెద్దగా  ప్రభావం చూపే అవకాశాలు లేకపోవడమేననీ అంటున్నారు.