హైడ్రా దూకుడు ఆరంభశూరత్వమేనా?

మహానగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇదే దూకుడును చివరి వరకూ కొనసాగించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.  చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కారణంగనే విశ్వనగరం అని చెప్పుకునే భాగ్యనగరం చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతోంది. కాలనీలకు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. ఇలా చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలలో జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో నిర్మించిన జగన్ నివాసం కూడా ఉంది. ఇప్పుడు ఆ జగన్ నివాసానికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇవ్వం కూల్చివేయడమే అని గంభీరంగా ప్రకటించిన హైడ్రా కమషనర్ రంగనాథ్.. మరి జగన్ లోటస్ పాండ్ నివాసాన్ని కూల్చివేయకుండా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. చెరువులను ఆక్రమించి నిర్మించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చారంటే అర్ధం ఉంది. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశాన్ని తప్పుపట్టలేం. కానీ జగన్ లోటస్ పాండ్ వంటి నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు.  నిబంధనల ప్రకారం కూల్చివేయడానికి హైడ్రా ఎందుకు వెనకాడుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే నోటీసులు లేవు కూల్చివేతలే అంటున్న రంగనాథ్ మాటల ఉత్తుత్తి బెదరింపులేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. 
 ఇటీవల తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది హైడ్రాయే.  హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ అధారిటీ. దీనిని తెలంగాణ    సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సాహసోపేతంగా చెరువులు, కుంటలు,నాళాలు ఆక్రమించుకున్న కబ్జాకోరుల ఆట కట్టించి నగరానికి ఏర్పడుతున్న వరదల ముప్పు నుంచి కాపాడాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేశారు.  ఆయన చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్నారనడానికి  సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూలగొట్టడమే ఉదాహరణ. తుమ్మడి కుంట చెరువు ఆయకట్టులో మూడున్నర ఎకరాలు ఆక్రమించారని స్పష్టమైన ఆధారాలతో నోటీస్ కూడా ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. రాష్ట్రప్రభుత్వంతో పాటు హైడ్రా అధికారులకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.రే వంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆరంభశూరత్వం కాదని మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంఘటన నిరూపించింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్ కన్వెన్షన్ వద్ద హడావుడి చేసింది.అయ్యప్ప సోసైటీ పరిధిలో అక్రమకట్టడాలను కొన్ని కూల్చి ఆ తరువాత ఆ ఊసే మర్చిపోయింది. గత పదేళ్లుగా అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం ఆక్రమణలు, చెరువులపై అక్రమకట్టడాల జోలికి పోలేదు.  చెరువులు,నాళాల ఆక్రమణల కారణంగా చిన్న పాటి వర్షానికి కూడా రోడ్లు నదులుగా మారిపోతున్నా,జనం నరక యాతన అనుభవిస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఊరుకున్నది.

నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆక్రమణల ఊసెత్తలేదు. చెరువల సంరక్షణ గురించి పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్ కాస్తా వాన పడితే హైదరాబాధ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ కు ఈ నరక బాధను తప్పించాలన్న ధృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది.  అది పని ప్రారంభించింది. నగరంలో అనేక చెరువులు పూడ్చి విద్యా సంస్థలను నిర్మించారు. వాటిలో ఓవైసీ, మల్లారెడ్డి వంటి ప్రముఖులవి కూడా ఉన్నాయి. ఆయా యజమానులు ప్రభుత్వ దూకుడుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే పలువురు మధ్యతరగతి కుటుంబాలు కూడా కోర్టులను,అధికారులను ఆశ్రయిస్తున్నారు.

విద్యా సంస్థలను కూల్చివేసి విద్యార్ధులకు విద్యా సంవత్సరం నష్టం చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే కాకపోయినా వారికి కొంతసమయం ఇచ్చి ఈ అక్రమ కట్టడాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే 20,30 సంవత్సరాలు గా ఉంటున్న కుటుంబాలు తమ గతేమిటని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు అధికారులే  చట్టపరంగా  అనుమతి ఇచ్చారు. అలా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన ఆధికారులపైనా చర్యలకు ఉపక్రమించారు అది మంచిదే. కానీ చట్టబద్ధంగా అనుమతి పొందిన నిర్మించిన భవనాలకు చట్ట విరుద్ధం అంటూ ఎలా కూల్చేస్తారన్నది ప్రశ్న. మొత్తం మీద హైడ్రాది ఆరంభశూరత్వంగానే మిగిలిపోతుందా? నగరంలోని ప్రతి అక్కమకట్డాన్నీ నేలమట్టం చేసే వరకూ ఇదే దూకుడు ప్రదర్శిస్తుందా అన్నది చూడాలి.