కట్ట పుట్టాలమ్మ ఆలయ శిల్పాలను కాపాడుకోవాలి!
posted on Sep 14, 2024 3:22PM
పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి సమీపంలోని కరకంబాడి కట్ట పుట్టాలమ్మ దేవాలయం ముందున్న మధ్య యుగ శిల్పాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
ఎస్.వి. భక్తి ఛానల్ సీనియర్ ప్రొడ్యూసర్ మరియు వారసత్వ ప్రేమికుడు బి.వి.రమణ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శనివారం నాడు ఈ శిల్పాలను పరిశీలించారు. ఆలయ మండపంలో కుడివైపున వీరభద్ర, అమ్మవారు, గణేశా, శిల్పాలు ఎడమవైపున ఆత్మార్పణ వీరుడు, ద్వారపాల శిల్పాలు భూమిలో కూరుకుపోయి, పసుపు రంగుతో నిండిపోయి ప్రాచీనతను కూలిపోతున్నాయని, ఆ విగ్రహాలను పైకి లేపి, రంగులు తొలగించి, పీఠాలపై నిలబెట్టాల్సిన అవసరముందని కరకంబాడి ఆలయ నిర్వాహకులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విజయనగర అనంతర కాలం నుంచి, బ్రిటిష్ కాలం వరకు కరకంబాడి-మామండురు -కృష్ణాపురం పాలెగాళ్లు అయిన నాయిని వంశీయులు కడప, నెల్లూరు, చెన్నపట్నం నుంచి, తిరుపతికి వచ్చే భక్తులు అడవి జంతువులు, దొంగల నుండి కాపాడే బాధ్యతలు నిర్వర్తిం చేవారని, ఆ పాలెగాళ్లే, పుట్టాలమ్మ ఆలయాన్ని నిర్వహించే వారని, ఈ శిల్పాలు కూడా అప్పట్నుంచి పూజాలందుకొంటున్నాయని బి.వి. రమణ చెప్పారు.
400 సంవత్సరాల చరిత్ర కలిగి, పురావస్తు ప్రాధాన్యత గల ఈ శిల్పాలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలని ఆలయ అధికారులను, గ్రామస్తులను శివనాగిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శిల్పి పెంచల ప్రసాద్ పాల్గొన్నారు.