ప్యాక్డ్ జ్యూసుల గుట్టేంటో తెలిస్తే విస్తుపోతారు!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు చాలా మంచివని వైద్యులు చెబుతారు. ఆరోగ్యం మీద అంతో ఇంతో స్పృహ ఉన్నవారు కూడా పండ్లు, పండ్ల రసాల మీద ఆసక్తి చూపిస్తారు. చాలామంది పండ్లు తినడం కంటే పండ్ల రసాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ పండ్ల రసాలు తయారు చేసుకోవాలంటే బద్దకం వల్లా, అవి చేసుకునేంత సమయం లేకపోవడం వల్ల బయట దొరికే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. బయట ప్యాక్ చేయబడిన జ్యుస్ ప్యాకేట్స్, బాటల్స్ మీద కూడా 100% ప్యూర్ అనే మాటను చూసి అవన్నీ ఆరోగ్యమే అనే ఆలోచనతో వాటిని బాగా కొని తాగుతూ ఉంటారు. అయితే  ప్యాకేజ్డ్ జ్యూస్‌ల ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాటిలో కొన్ని రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి.  ఇవి అనేక విధాలుగా హాని చేస్తాయి.  జ్యూస్ ల ద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే తాజా పండ్ల రసాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

పిల్లలు, పెద్దలు కూడా బయటకెళ్లినప్పుడు పండ్ల రసాన్ని ఇష్టపడతారనడంలో సందేహం లేదు, ప్యాక్‌డ్ జ్యూస్‌లు శరీరానికి మేలు చేస్తాయని అనుకుంటాం కానీ నిజానికి దాని వల్ల మనం అనుకున్నంత ప్రయోజనం ఉండదు.  ప్యాకేట్స్, బాటల్స్ అందంగా కనబడుతూ ఆకర్షిస్తాయి, ఇక ఏ సెలబ్రిటినో వాటిని ప్రమోట్ చెడితే కొనుగోళ్లు జోరందుకుంటాయి. అయితే ఈ జ్యుస్ లు ముమ్మాటికీ హాని చేసేవే..

 100% నిజమైన జ్యూస్‌ అంటూ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు అమ్ముడవుతున్నాయి. అవన్నీ కూడా ఆమోదం తెలిపినవే అని, తక్షణ శక్తిని ఇస్తాయని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిలో చక్కెర, రంగు, రసాయనాలు తప్ప ఇంకేమి ఉండదు.  చాలా వరకు ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో ఆర్సెనిక్, సీసం వంటి రసాయనాలు ఉంటాయి.  ఇవి చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి.  దాదాపు 24  రకాల పండ్ల రసాల బ్రాండ్లను పరీక్షించిన తరువాత అన్నింటిలోనూ సీసం శాతం ఎక్కువగా బయటపడింది. ఇవి పిల్లలలో న్యూరో డెవలప్‌మెంటల్ సమస్యలను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ఆపిల్ జ్యుస్ కి సంబంధించిన బ్రాండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. 

ఖచ్చితంగా చెప్పాలంటే , ఆర్సెనిక్ అనేది పర్యావరణ కాలుష్యం, అలాంటిది మనిషికి ఇంకెంత ప్రమాదం చేకూరుస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

యాపిల్స్, ద్రాక్ష సహజంగా మట్టిలో ఉన్న, లేదా పురుగుమందుల కోసం ఉపయోగించే ఆర్సెనిక్‌ను సహజంగానే గ్రహిస్తుంది. ఇలాంటి వాటితో ప్యాక్డ్ జ్యుస్ లు తయారుచేస్తే అవి శరీరానికి మరింత హాని కలిగిస్తాయి. 

ప్యాక్ చేయబడిన జ్యుస్ ల గుట్టు ఏంటో తెలుసా..

ప్యాక్ చేయబడిన జ్యూస్ లు బహుశా తక్కువ నాణ్యత గల పండ్ల నుండి తయారు చేయబడతాయి.

ఈ జ్యూస్ లు మంచి రుచిని, సువాసనను కలిగి ఉంటాయి. తాగేకొద్ది తాగాలని అనిపిస్తుంది. రంగు కూడా టెంప్టింగ్ గా ఉంటుంది. కానీ అన్నీ కృత్రిమమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవే..

డయాబెటిక్ లేదా అధిక బరువు ఉన్నవారు ప్యాక్డ్ జ్యూస్‌లను అసలు తీసుకోకూడదు. ఇంకా ఈ ప్యాక్ జ్యుస్ లు ఎక్కువగా తాగే వారికి తొందరగా డయాబెటిక్, అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త.

                                 ◆నిశ్శబ్ద.