విటమిన్-సి లోపం వచ్చిందని గుర్తుపట్టడం ఎలా?
posted on Jun 12, 2023 9:30AM
శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి, ఆహారంలో పోషకాలు బాగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు తక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం విటమిన్-సి అవసరం.
సమతులాహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్-సి సులువుగా అందుతుంది. కానీ చాలామంది సమతులాహారం తీసుకోరు. అందుకే అనారోగ్యాలు తొందరగా వచ్చేస్తున్నాయి.
విటమిన్-సి శరీరానికి ఎలా మేలు చేకూరుస్తుందంటే..
విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా విటమిన్-సిని పొందడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. కణాలను రక్షించడంలో వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, చర్మం, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇది అవసరం.
విటమిన్ సి లోపిస్తే..
శరీర రోగనిరోధక శక్తికి విటమిన్-సి చాలా అవసరం కాబట్టి, అది లోపిస్తే, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆహారంలో పోషకాహారం లేని వ్యక్తులలో విటమిన్ సి లోపం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధి ఉన్నవారు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు కూడా విటమిన్ సి లోపంతో బాధపడుతుంటారు.
ధూమపానం చేసినప్పుడు ఏర్పడే ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తిరిగి సాధారణం చేయడానికి ప్రతిరోజుకు అదనంగా 35 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది.
విటమిన్ సి లోపం ఉందని ఎలా తెలుసుకోవాలంటే..
విటమిన్-సి లోపం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. పెద్దలలో, విటమిన్ సి లోపం యొక్క లక్షణాలు వారాల నుండి నెలల వరకు డవలప్ అవుతాయి. దీని కారణంగా బలహీనత, అలసట, చిరాకు, బరువు తగ్గడం, గాయాలు సరిగా మానకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం వంటివి జరుగుతాయి.
విటమిన్-సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురైతే, ఇది విటమిన్-సి లోపానికి కూడా సంకేతం.
విటమిన్ సి ఎలా పొందాలంటే..
విటమిన్-సి కోసం, ఆహారంలో చాలా సులభమైన మార్పు చేసుకోవచ్చు. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా, నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివి, పైనాపిల్ మొదలైన వాటిని కూడా సులభంగా నెరవేర్చడానికి ఉపయోగించవచ్చు. తీసుకునే ఆహారంలో ఇవి తప్పక ఉండేలా చూసుకుంటే విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చు.
◆నిశ్శబ్ద.