జగన్‌పై మరో కోడికత్తి దాడి? అబ్బాయ్.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో!
posted on Dec 13, 2021 2:38PM
ఆశ్చర్యం. సీఎం జగన్‌రెడ్డిపై దాడికి కుట్ర జరుగుతోందట. ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని పొంచిఉందట. ఈ మాట అంటున్నది మరెవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. సర్లే.. ఆయనేదో ఎమోషనల్‌గా అలా అన్నారనుకున్నా.. ఆ వెంటనే ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం జగన్‌రెడ్డి ప్రాణాలకు హాని తలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరుసబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కపడుతున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? నిజంగానే ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు దాగుందా? వైసీపీ నాయకుల ఆందోళనకు రీజనుందా? అనే చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రికి హానీ తలపెట్టడం అంటే మాటలా? జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో.. ప్యాలెస్ నుంచి బయటకు వస్తే భారీ కాన్వాయ్‌లు.. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు.. కాలు కిందపెట్టగానే ముందూవెనకా రక్షణ గోడలా నిలిచే ట్రైన్డ్, ఆర్మ్డ్ బాడీగార్డ్స్.. ఇంతటి టైట్ సెక్యూరిటీ ఉన్న సీఎం జగన్‌పై అటాక్ చేయడమంటే మామూలు విషయమా? మరి, వైసీపీ నేతలు ఎందుకంత ఆందోళన చెందుతున్నట్టు? జగన్‌పై దాడి జరుగుతుందేమోనని ఎందుకు అనుమానిస్తున్నట్టు?
అయినా, ఏపీలో దాడుల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలిసిందే. టీడీపీ సాధు జంతువులాంటి పార్టీ. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినా.. మంగళగిరి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినా.. సభలో చంద్రబాబు భార్యపై అసంబద్ధ వ్యాఖ్యలు చేసినా.. అధినేత దీక్షలు, కన్నీరు కార్చారే కానీ.. ఎదురుదాడి చేయలేదు. అలాంటి కల్చర్ టీడీపీకి లేనే లేదు. ఇక, జనసేన తమకు జగన్‌తో శత్రుత్వం లేదని.. ఆయన విధానాలపై మాత్రమే తమ పోరాటమని పవన్‌కల్యాణ్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇక బీజేపీ ఎలాగూ మిత్రపక్షంలాంటి పార్టీనే. కమ్యూనిస్టులకు పెద్దగా ఉనికే లేకపాయే. ఇక ముఖ్యమంత్రిపై జగన్‌రెడ్డిపై దాడులు చేసేది ఎవరు?
జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై విశాఖ విమానాశ్రయం లాబీలో కోడికత్తి దాడి జరిగింది. ఆ దాడి చేసింది కూడా వైసీపీ వర్గీయుడేనని, సానుభూతి కోసమే కోడికత్తి దాడి డ్రామా నడిచిందనే విమర్శలు ఉన్నాయి. ఇక, జగన్‌రెడ్డి సీఎం అయ్యాక.. సొంత బాబాయ్ వివేకానందరెడ్డిపై ఆయన ఇంట్లోనే గొడ్డలితో దాడి జరిగింది. దారుణంగా నరికి చంపబడ్డారు. ముఖ్యమంత్రి బాబాయ్‌నే అంత దారునంగా హత్య చేసినా.. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీ వీడనేలేదు. సీబీఐ దర్యాప్తు ఆసాంతం వైసీపీ నాయకుల చుట్టూనే తిరుగుతోంది. జగన్ సన్నిహితుల వైపే అనుమానాలన్నీ ముసురుతున్నాయి. ఇలా అబ్బాయ్‌పై కోడికత్తి అటాక్ అయినా.. బాబాయ్‌పై గొడ్డలి వేటు అయినా.. అదంతా వైసీపీ యాక్షనే అంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు లేటెస్ట్‌గా.. సీఎం జగన్‌రెడ్డిపై దాడికి కుట్ర జరుగుతోందంటూ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తే ఆరోపించడం మామూలు విషయమా? అదే నిజమైతే.. ప్రతిపక్షాలు అలా దాడి చేసే రకం కాదంటున్నారు. మరి, జగన్‌పై దాడి చేసే అవసరం ఎవరికి ఉంటుంది? ఉద్యోగులకా? ఓటీఎస్ బాధితులకా? తాగలేక మింగలేక నిత్యం బాధపడుతున్న మద్యం బాధితులా? ఉద్యోగాలు లేక ఆవేశంతో రగిలిపోతున్న నిరుద్యోగ యువతా? పెరిగిన పన్నులు కట్టలేని పేదలా? ఇసుక కొరతతో ఉపాధి దొరకని దినసరి కూలీలా? అఘాయిత్యాలను అడ్డుకోలేకపోతున్నందుకు మహిళలా? ఇంతకీ వైసీపీ నేతలు అనుమానిస్తున్నట్టు.. జగన్‌రెడ్డిపై దాడి చేసేది ఎవరు? అనేది ఆసక్తికరం.
వైసీపీ నేతల కామెంట్లపై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారూ జగన్ రెడ్డి ప్రాణాలకు హానితలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం.. మరో కోడికత్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్లాగా అనిపిస్తోంది. ఓవైపు అప్పులకుప్ప, మరోవైపు తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో.. మళ్లీ కోడికత్తికి సానబెడుతూ, గొడ్డలికి దారుబెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అబ్బాయ్ గారు.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దుర్మార్గుడికి దూరంగా ఉంటున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోంది. బురద రాజకీయంమాని 'హూ కిల్డ్ బాబాయ్' అనే ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
అయ్యన్న పాత్రుడు అంటున్నట్టు.. ప్రభుత్వ వైఫల్యాలు, అప్పుల కుప్పలు, ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. జగన్‌రెడ్డిపై మరో కోడికత్తి దాడి జరుగుతుందా? లేక, వివేకా మాదిరే.. జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులను మరోసారి టార్గెట్ చేస్తారా? ఇంతకీ వైసీపీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, నారాయణస్వామిల వ్యాఖ్యల పరమార్థం ఏంటి? వారి అనుమానం ఎవరిపైన..? అంటూ చర్చించుకుంటున్నారు ఏపీ ప్రజలు.