రాజ్యసభకు కవిత..! రెండో సీటుపైనే ఉత్కంఠ
posted on Dec 14, 2019 11:38AM
వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఏపీకి నాలుగు, తెలంగాణకి రెండు రానున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం అటు ఏపీలోనూ... ఇటు తెలంగాణలోనూ అధికార పార్టీకే ఆ స్థానాలను దక్కించుకోనున్నాయి. అయితే, తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న స్థానాల్లో టీఆర్ఎస్ సీనియర్ కె.కేశవరావు సీటు ఒకటి కూడా ఉంది. అయితే, కేకేకు మళ్లీ రెన్యువల్ లభిస్తుందో లేదోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఈమధ్య కేసీఆర్ కు కేకేకు మధ్య కొంచెం దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. దాంతో, కేకేకు రెన్యువల్ దక్కకపోవచ్చని అంటున్నారు.
మరోవైపు, రాజ్యసభ సభ్యత్వం కోసం టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ, ముఖ్యంగా కేసీఆర్ తనయురాలు కవిత... అలాగే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వినోద్ కు ఇఫ్పటికే కేబినెట్ ర్యాంక్ హోదాతో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఉండటంతో... రాజ్యసభకు పంపించకపోవచ్చనే అంటున్నారు.
ఇక, కవితను మాత్రం కచ్చితంగా రాజ్యసభకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. ఎంపీగా ఉన్నప్పుడు లోక్ సభలో అనేక అంశాలపై ధాటిగా మాట్లాడి ప్రశంసలు పొందిన కవితకు రాష్ట్ర సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతో... రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో, టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. అయితే, రెండో సీటు విషయంలోనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని, దాన్ని ఎవరికి కేటాయిస్తారనేది చివరి నిమిషం వరకు సస్పెన్సే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.