బెంగాల్ లో మమతదే విజయం! 

దేశ వ్యాప్తంగా రాజకీయ మంటలు రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ గెలవబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ లో హ్యాట్రిక్ విజయానికి తృణామూల్ కాంగ్రెస్ , పాగా వేసేందుకు బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ మధ్య యుద్దమే సాగింది. ఎనిమిది విడతలుగా జరిగిన పోలింగ్... గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తంగా సాగింది. ప్రతి దశలోనూ గొడవలు జరిగాయి. పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలు కూడా జరిగాయి. అన్ని దశల్లోనూ హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. గురువారం చివరి దశ పోలింగ్ ముగియడంతో బెంగాల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.

పోలింగ్ సరళిని అంచనా వేసిన బీజేపీ .. బెంగాల్ లో పాగా వేస్తామని ధీమాలో ఉండగా... ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం మళ్లీ టీఎంసీదే అధికారమని తెలుస్తోంది. గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వేలో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తేలింది. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడంతో 292 స్థానాలకే పోలింగ్ జరిగింది. అయితే 292లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ 170 (ప్లస్ ఆర్ మైనస్ 16 ), బీజేపీకి 110 ( ప్లస్ ఆర్ మైనస్ 14). కాంగ్రెస్ కూటమికి 10 (ప్లస్ ఆర్ మైనస్ 4) సీట్లు వస్తాయని ఎగ్టిట్ పోల్ సర్వేలో తేలింది. టీఎంసీకి 157 నుంచి 185 సీట్లు, బీజేపీకి 96 నుంచి 125 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 8 నుంచి 14 సీట్లు వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. 

బెంగాల్ లో ప్రాంతాల వారీగా చూస్తే.. నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఇక్కడ బీజేపీకి 26 నుంచి 32 సీట్లు రానుండగా.. టీఎంసీకి 18 నుంచి 25 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ కూటమికి కేవలం 3 నుంచి 4 సీట్లు నార్త్ బెంగాల్ లో రానున్నాయి.

సెంట్రల్ బెంగాల్ లో టీఎంసీకి లీడ్ రాబోతోంది. ఇక్కడ టీఎంసీకి 38-45, బీజేపీకి 24-29, కాంగ్రెస్ కూటమికి 4-7 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.

గ్రేటర్ కోల్ కతా రీజియన్ లో మాత్రం బీజేపీ పత్తా లేకుండా పోయింది. ఇక్కడ టీఎంసీకి ఏకపక్ష ఫలితాలు వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. గ్రేటర్ కోల్ కతాలో టీఎంసీకి ఏకంగా 80 నుంచి 91 సీట్లు రానుండగా.. బీజేపీకి కేవలం 17 నుంచి 26 సీట్లకే పరిమితం కాబోతోంది. 

ఇక బెంగాల్ పోలింగ్ కు తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించిన జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో మాత్రం బీజేపీ సత్తా చాటనుందని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.  జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో బీజేపీకి 31-37 అసెంబ్లీ సీట్లు గెలవనుండగా.. టీఎంసీ కేవలం 18-24 స్థానాలకే ఆగిపోనుందని సర్వే చెబుతోంది. మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఈ ఏరియాలోనే ఉంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికార ఈసారి కూడా నందిగ్రామ్ ఏరియాలో తన పట్టు నిలుపుకున్నారని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. దీంతో నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో తాము తప్పకుండా గెలుస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది. 

కుచ్ బీహార్ , అలిపూర్దూర్..జల్ పాయ్ గురి, డార్జిలింగ్ . దక్షిణ్ దినాజ్ పూర్ , మాల్దా, నదియా జిల్లాలో బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. హుగ్లి, మిడ్నాపూర్,  పూరిలియా, బంకూరా జిల్లాలో హోరాహోరీ పోరు సాగినా.. కమలానికి ఆధిక్యత కనిపిస్తోంది. కోల్ కతాలో మాత్రం టీఎంసీ స్వీప్ చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హౌరా జిల్లాలోనూ టీఎంసీ హవా ఉందని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడిస్తోంది.