పరీక్షలపై పోరు.. కేఏ పాల్‌ దీక్ష

విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ప‌రీక్షలు వాయిదా వేయాలి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పెట్టడం సరికాదు. అందుకే, ఎగ్జామ్స్ ర‌ద్దు కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ‌లో దీక్ష చేప‌ట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్‌ స్పష్టం చేశారు.  

ప‌రీక్షలు ర‌ద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో అడ్మిట్‌ చేశార‌ని చెప్పారు కేఏ పాల్‌. . శుక్ర‌వారం వాదనలు జరుగుతాయని.. 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు త‌న‌ దీక్ష కొనసాగుతుందన్నారు. "నా పిల్లల్ని పరీక్షలకు పంపడం లేదు. పరీక్షలు రద్దు చేయమని, పాస్‌ చేయమని అడగట్లేదు. రెండు నెలలు వాయిదా వేయమని కోరుతున్నా. పరీక్షలు వాయిదా పడే వరకు దీక్ష కొనసాగిస్తా. నా దీక్ష దగ్గరకు ఎవరూ రావొద్దు’’ అని కేఏ పాల్‌ అన్నారు.  

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే-05 నుంచి ఇంటర్ పరీక్షలు, జూన్ తొలి వారంలో ప‌ది ప‌రీక్ష‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌ను ఆన్‌లైన్ క్లాసెస్‌కు అందుబాటులో ఉండాల‌ని మంత్రి కోరారు. పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించ‌బోమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.