నాగార్జున సాగర్ ఎగ్జిట్ పోల్.. సంచలన ఫలితం! 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంక కీలకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకుని పోరాడటంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. పోలింగ్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదైంది. నాగార్జున సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఏడుసార్లు గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సాగర్ లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య విజయం సాధించారు. అయితే గత డిసెంబర్ 1న అనారోగ్యంతో నర్సింహయ్య చనిపోయారు. దీంతో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరిగింది.

తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఘోర ఫలితాలు చవిచూసిన కాంగ్రెస్ .. తమకు పట్టున్న నాగార్జున సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జానారెడ్డిని మరోసారి బరిలోకి దింపింది. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుడు భగత్ పోటీ చేశారు. బీజేపీ మాత్రం జనరల్ సీటులో గిరిజన వ్యక్తిని బరిలోకి దింపి ప్రయోగం చేసింది. మూడు పార్టీలు తమ బలగాన్నంతా సాగర్ లోనే మోహరించి ప్రచారం చేశాయి. కరోనా వైరస్ భయపెడుతున్నా... అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ కూడా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు .

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 లక్షల 20 వేలకు పైగా ఓటర్లు ఉండగా.. ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 88 శాతం పోలింగ్ జరిగింది. 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెరగడంతో అన్ని పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి గండం అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి మద్దతుగానే పోలింగ్ శాతం పెరిగిందని అధికార పార్టీ ధీమాగా ఉండగా.. ప్రజా వ్యతిరేకత వల్లే ఓటర్లు కసిగా ఓటేశారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ మాత్రం గెలుపు రేసులో ఉండకపోయినా గౌరవప్రదంగానే ఓట్లు సాధిస్తామని చెబుతోంది. 

అయితే నాగార్జున సాగర్ పై ఆరా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ లో సంచలన ఫలితం కనిపిస్తోంది. ఎన్నికల్లో సర్వేల్లో ఆరా సంస్థకు మంచి పేరుంది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దే విజయమని ఆరా సంస్థ సర్వేలో తేలింది. అయితే అందరు అనుకున్నట్లుగా కాకుండా కారు పార్టీకి సాగర్ లో భారీగానే ఓట్లు రానున్నాయి. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 39.93 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ కేవలం 6. 31 శాతం ఓట్లతో డిపాజిట్ కోల్పోనుందని ఆరా ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. ఇతరులకు 3.28 శాతం ఓట్లు రానున్నాయి. ఆరా సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు దాదాపు 10 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి. అంటే దాదాపు 20 వేల ఓట్లతో నోముల భగత్ సాగర్ లో గెలవబోతున్నారని ఆరా సంస్థ సర్వేలో తేలింది. మూడు శాతం ఓట్లు అటు ఇటుగా వేసుకున్నా.. 15 వేల నుంచి 25 వేల తేడాతో నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలవబోతోంది.