జాతీయ స్థాయిలో మంటగలిసిన జగన్ ప్రతిష్ఠ!

వైసీపీ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని అందుకోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ నమ్మడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వైసీపీలోని కొందరు మినహా మెజారిటీ నేతలు వాస్తవాన్ని అంగీకరించారు. అతి కొద్ది మంది మాత్రం తెలుగుదేశం కూటమి విజయానికి ఈవీఎంల టాంపరింగే కారణమని ఆరోపణలు గుప్పిస్తున్నారు.   జూన్ 4, 2024న ప్రకటించిన ఫలితాలు, జగన్ ఐదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన విస్పష్ట తీర్పు అనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇంతటి ఘోర ఓటమిని కలలో కూడా ఊహించని వైసీపీ క్యాడర్, నేతలు ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోనే లేదు.  అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారికి వాస్తవం అవగతమవ్వడం మొదలైంది. జగన్ తీరు, వ్యవహారశైలి పార్టీ ఓటమికి కారణమన్న నిర్థారణకు వచ్చేసిన పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. 

అది వేరే సంగతి.. అసలే ఉనికి కసం నానా తిప్పలూ పడుతున్న వైసీపీని లడ్డూ ప్రసాదం వివాదం నిండా ముంచేసింది.  స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని వెల్లడించడంతో ఎలాంటి సందేహాలకూ తావులేని విధంగా మెజారిటీ ప్రజలు విశ్వసించారు. అంతే కాదు... లడ్డూ ప్రసాదంలో కల్తి విషయం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.  జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకానికి పడిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన మాట వాస్తవం. అన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు చేసిన ఆందోళన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలలో వాస్తవం ఉందనే జనం నమ్మారు. అందులో సందేహం లేదు. అందుకే వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల ఖండనలు, సవాళ్లను జనం పెద్దగా పట్టించుకోలేదు. 

సరిగ్గా ఇదే సమయంలో  లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి వార్తలను  నేషనల్ డెయిరీ డెవల ప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి)  ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.  దీంతో వైసీపీకి సమర్ధించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది.  ఈ  ల్యాబ్ రిపోర్టును జాతీయ మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించింది. ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇది విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి జంతు కొవ్వు అవశేషాలు ఉన్న నెయ్యిని వాడటంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన ఆచార్యుడు, అయోధ్య రామమందిర ప్రధానార్చుకుడు కూడా స్పందించి, ఇంతటి ఘోర అపచారానికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో విమర్వలు గుప్పించింది. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి భోభాకరంద్లాజే అయితే ఒక అడుగు ముందుకు వేసి.. కల్తీ నెయ్యే కాదు... తిరుమల కొండపై అన్యమత చిహ్నాల ఏర్పాటుకు జగన్ సర్కార్ ప్రయత్నిం చిందనీ, అలాగే పద్మావతి కళాశాల, టీటీడీ విద్యాలయాల్లో శ్రీవారి చిత్రపటాలను తొలగించే యత్నం కూడా చేసిందనీ ఆరోపించారు.