ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తాం: రాజాసింగ్
posted on Apr 1, 2025 1:07PM
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే మహరాష్ట్ర హిందువులకు తెలంగాణ హిందువులు మద్దత్తు గా నిలుస్తారని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక ఔరంగజేబు, బాబర్ వారసులు ఆందోళనకు గురయ్యారన్నారు. భారత్ ను హిందూ దేశంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించాలని రాజాసింగ్ అభిలషించారు. గతేడాది ధూల్ పేట నుంచి శ్రీరామనవమి శోభాయాత్రను ఎంఐఎం అడ్డుకుందని ఈ యేడు ఎవరి అనుమతులు, ఆదేశాలు లేకుండానే శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహిస్తామని రాజాసింగ్ చెప్పారు.
ఔరంగ జేబు ఆఖరి మొఘల్ చక్రవర్తి. ఆరో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు ఉన్న చక్రవర్తులు మతసామరస్యానికి పెద్ద పీట వేస్తే ఔరంగజేబు మాత్రం హిందువులపై జిజియా పన్ను వసూలు చేసిన చక్రవర్తిగా పేరుతెచ్చుకున్నాడు. ముస్లింల నుంచి జకాత్ పన్ను, హిందువులనుంచి జిజియా పన్ను వసూలు చేసేవాడని అంటారు. మొఘల్ చక్రవర్తి అయినప్పటికీ ఇస్లాం ను అనుసరిస్తూ టోపీలు కుట్టి జీవనం సాగించేవాడు. హైద్రాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మహరాష్ట్రలో ఉన్న ఔరంగ జేబు సమాధిని ఔరంగాబాద్ లో సందర్శించడంతో భారతీయ జనతాపార్టీ నేతలతో బాటు హిందుత్వ వాదులు తీవ్రంగా ప్రతిఘటించారు. రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలకు ఔరంగ జేబు సమాధి కేంద్రబిందువయ్యింది.
మొఘల్ చక్రవర్తుల సమాధులకు ఔరంగ జేబు సమాధి భిన్నంగా ఉంటుంది. కేవలం మట్టితో కప్పిన ఈ సమాధి అతి నిరాడంబరంగా ఉంటుంది. సమాధిని పరిరక్షించే బాధ్యత షేక్ షుకుర్ పూర్వికులు తీసుకున్నారు. షేక్ షుకుర్ ఆరోతరానికి చెందిన వారు. సమాధి మీద వనమూలికలను మాత్రమే పెంచుతున్నారు. ఔరంగ జేబు సమాధిని చూడటానికి ప్రపంచనలుమూలలనుంచి పర్యాటకులు ప్రతి నిత్యం వస్తుంటారు. చత్రపతి శంభాజీ మహరాజ్ ను 45 రోజుల పాటు హింసించి చంపేసినట్టు విహెచ్ పి, భజరంగ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఔరంగజేబు మతగురువు షేక్ జైనుద్దీన్ సమాధి పక్కనే ఈ సమాధిని నిర్మించారు.