సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన ప్రధాని మోడీ
posted on Apr 15, 2025 9:44AM

పధ్నాలుగేళ్ల కిందట ఓ వ్యక్తి ఓ ప్రతిజ్ణ చేశారు. అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అవ్వాలనీ, ఆయనను తాను స్వయంగా కలవాలనీ, అంత వరకూ పాదరక్షలు ధరించబోననీ ప్రతిన పూనారు. అప్పటి నుంచీ ఆ వ్యక్తి పాదరక్షలు ధరించడం మానేశారు. 2014 ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ పదవీ పగ్గాలు చేపట్లారు. అయినా ఆ వ్యక్తి ప్రధానిని కలవడం కుదరలేదు. దీంతో పాదరక్షలు ధరించబోనన్న తన ప్రతిజ్ణను కొనసాగించారు. 2019లో మరో సారి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. నరేంద్రమోడీ దేశ ప్రధానిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ వ్యక్తి తన దీక్షను కొనసాగించారు. 2024 ఎన్నికలలో కూడా ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యారు. మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పది నెలల తరువాత మోడీ ఆ వ్యక్తిని కలిశారు. దీక్షను విరమింప చేశారు.
అసలు విషయం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందట హర్యానాకు చెందిన రాంపాల్ కస్యప్ అనే వ్యక్తి ప్రధాని మోడీపై అభిమానంతో ఆయన ప్రధాని అయ్యే వరకూ, ఆయనను తాను కలిసే వరకూ పాదరక్షలు ధరించేది లేదని శపథం చేశారు. పాదరక్షలు ధరించబోనన్న దీక్షను గత 14 ఏళ్లుగా కొనసాగిస్తూనే వచ్చారు. చివరకు ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ రాం కాశ్యప్ ను యమునాగర్ లో స్వయంగా కలిశారు. ఇటువంటి ప్రతిజ్ణలు చేయవద్దనీ, ప్రజా సేవపై దృష్టి పెట్టమనీ హితవు చెప్పారు. అంతే కాకుండా స్వయంగా రాం కాశ్యప్ కు పాదరక్షలు తొడిగి దీక్ష విరమింప చేశారు. ఆ సందర్భంగా రాంపాల్ కశ్యప్ తో మోడీ కొద్ది సేపు మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదకగా ప్రజలతో పంచుకున్నారు.
హర్యానాలోని కైథాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దు. మీరు పని చేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు?" అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈరోజు యమునానగర్ బహిరంగ సభలో కైథాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక, నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను - మీ ప్రేమను గౌరవిస్తాను... దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి!" అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాంపాల్ కశ్యప్ కు తాను పదరక్షలు తొడుగుతున్న వీడియోను ఆ పోస్టకు జత చేశారు.