అరబిక్ డాకూ.. హోరెత్తుతున్న జై బాలయ్య స్లోగన్
posted on Apr 14, 2025 4:06PM
.webp)
అటు పాలిటిక్స్‌లో ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది డాకు మహారాజ్. కలెక్షన్లతో పాటు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇరాక్‌లోని ఓ న్యూస్ పేపర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. దీంతో మరోసారి డాకు మహారాజ్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. దీనికి సబంధించిన ఫొటోను ఎక్స్‌లో బాలకృష్ణ అభిమానులు షేర్ చేస్తున్నారు.
డాకు మహారాజ్ లో అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారని యాక్షన్ సన్నివేశాలు బాగున్నా యని ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. హీరో పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని రాబిన్‌హుడ్ తరహాలో దీన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. దీని కథ గురించి, కలెక్షన్ల వివరాలను ప్రస్తావించారు. తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్ న్యూస్ పేపర్‌లో రావడం అరుదంటూ బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు.
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, బాబీదేవోల్ కీలకపాత్రలు పోషించారు. థియేటర్‌లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన హవా చూపిస్తోంది. విడుదలయ్యాక ఎన్నో రోజులు టాప్‌లో కొనసాగింది. ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా అందుబాటులో ఉంది. మొత్తానికి అరబిక్ పేపర్లో డాకూ మహరాజ్ అంతలా ఫోకస్ అవ్వడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జై బాలయ్య అంటూ హోరెత్తిస్తోంది.