మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ దూకుడు.. కసిరెడ్డి నివాసంలో సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు 2 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.  విజయవాడ సీపీ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో కర్త, క్రియ, కర్మ కసిరెడ్డి రాజశేఖరరెడ్డేనని వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్సుడు ఆ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కోసం సిట్ గాలింపు ప్రారంభించింది.

ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి మూడు సార్లు విచారణకు పిలిచారు. అయితే మూడు సార్లూ ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.  ఈ నేపథ్యంలోనే సిట్ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. సోమవారం (ఏప్రిల్ 14) కసిరెడ్డి నివాసానికి చేరుకున్న  సిట్ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంప్యూటర్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.  స్థానిక పోలీసుల సహకారంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కసిరెడ్డి ఇంట్లో లేరని అంటున్నారు.  అలాగే కసిరెడ్డి కార్యాలయంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు.