నబూతో.. నభవిష్యతి
posted on Apr 14, 2025 2:53PM

నాడు శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ నుంచి
నేడు దగాపడ్డ కిరణ్ చేబ్రోలు వరకూ
మధ్య అలేఖ్య చిట్టీ వంటి ఆడపిల్లలు సైతం
బూతు భాషనే ఆశ్రయిస్తున్నారెందుకు?
బూతు ఇంతటి ప్రధాన పాత్ర పోషిచడానికి కారణం ఏంటి?
సోషల్ మీడియా జమానా వచ్చాక.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయలేని, పలకలేని ఎన్నో పదాలు.. ఇక్కడ యధేచ్ఛ గా స్వైర విహారం చేస్తున్నాయ్. ఇవాళ అందరూ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. కానీ, గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్రబాబు విషయంలో తీవ్ర స్థాయిలో వ్యక్తిత్వ హననం చేసిన వారే.
ఆనాడు బాబు ఇది గౌరవ సభ కాదు- కౌరవ సభగా మారిందనీ. తాను తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సభ ద్వారా తిరిగి సంస్కరణకు పాల్పడతానని అన్నారు. అనడం మాత్రమే కాకుండా.. ఇదిగో ఇవాళ భారతీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ సొంత కార్యకర్త కిరణ్ చేబ్రోలు విషయంలో కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకూ కిరణ్ చేబ్రోలుపై మొత్తం ఐదు కేసులుండగా, వాటిలో మాజీ మంత్రి విడుదల రజనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న గుంటూరు పోలీసులు, అతడి సెల్ ఫోన్ సిగ్నళ్ల ద్వారా ఇబ్రహీం పట్నం దగ్గర అదుపులోకి తీసుకుని.. మంగళగిరి పీఎస్ కి తరలించారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే.. సీఎం ఆదేశాలతో పోలీసులే మొదట సుమోటోగా స్వీకరించడం. ఆ తర్వాత అతడిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టడం, రిమాండ్ కి తరలించేలా ఏర్పాట్లు చేయడం.
ఇదే గతంలో బోరుగడ్డ అనిల్.. బాబు, లోకేష్, పవన్ వంటి వారిపైనే కాకుండా.. పిల్లలని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నాటి సీఎం జగనన్ మోహన రెడ్డిగానీ, ఆయన ప్రభుత్వం నుంచి కానీ.. కనీస స్పందన లేదు. పైపెచ్చు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడమే తమకు కావల్సిందన్న చందంగా వ్యవహరించారు. లోలోన ఎంతగానో సంతోషించారని అంటారు.
ఆ మాటకొస్తే పోసాని కృష్ణమురళి.. తన విచారణలో చెప్పినదాన్నిబట్టీ చూస్తే.. సజ్జల టీమ్ ద్వారా ఆయనకు స్క్రిప్ట్ వచ్చేది. వీరి అనుచిత వ్యాఖ్యల వెనక ఎంతటి ఫ్యాన్ మార్క్ మాస్టర్ ప్లాన్ దాగి ఉందని తేటతెల్లమైందని అనడానికి ఇంతకన్నా మించిన సాక్ష్యాలు ఎక్కడ దొరుకుతాయ్?
కానీ కూటమి ప్రభుత్వం తొలి నాటి నుంచే మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం అనే అంశంలో నిషేధాజ్ఞలు జారీ చేయడం మాత్రమే కాదు.. ఆ దిశగా ఇప్పటికే ఎందర్నో ఊచలు లెక్కించేలా చేస్తోంది. ఇది సోషల్ మీడియా పరంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపట్ల తమ పంథా అని స్పష్టంగా తెలియ చేసింది. తరతమ బేధాలు చూసేది లేదు. వారు ఎవరైనా, ఏ పార్టీ వారైనా సరే విడిచి పెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాలను పంపుతోంది.
అయితే ఇక్కడే ఒక కొత్త వాదన. వివేకం సినిమాలోనూ కిరణ్ ఆరోపించినట్టుగా.. చూపించారనీ. భారతీరెడ్డికి, అవినాష్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారనీ.. ఈ చిత్రాన్ని చూడమంటూ.. బాబు కూడా బహిరంగ ప్రటకన చేశారనీ అంటారు కొందరు వైసీపీ వాదులు.
అయితే ఇదే వైసీపీ వారు.. హత్య అనే ఒక సినిమా తీసి.. అందులో కొందరి పాత్రలు కావాలనే లేకుండా చేసి.. తద్వారా తమదైన అనుకూల విధానంలో వివేకా హత్యకు సంబంధించి కొత్త అనుమానాలు రేకెత్తించేలా చేశారు. ఈ చిత్రంలో చూపిన తీరుపై.. సునీల్ యాదవ్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇందులో తమ పాత్రలను కావాలనే వక్రీకరించారనీ.. చాలా మంది పాత్రలు కావాలనే లేకుండా చేశారనీ.. సినిమా ద్వారా కూడా రాజకీయాలకు తెరలేపారనీ వైసీపీ వారిపై ఆరోపణలు చేస్తారు సునిల్ యాదవ్. ఈ దిశగా ఆయన ఫిర్యాదు చేశారు కూడా. ఒక దశలో హత్య సినిమా వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్లిందంటే, ఈ సినిమా క్లిప్పింగులు షేర్ చేసినా.. కేసులు పెట్టే వరకూ. ఇదే వివేకా హత్య విషయంలో.. అవినాష్ కి అన్ని విషయాలు తెలుసంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైతం సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా చూస్తే వివేకం సినిమా విషయాన్ని ఎత్తి చూపుతున్న వైసీపీ వాళ్లు.. మరి హత్య సినిమా తీయడం వెనక దాగిన రహస్యమేంటో చెప్పాలంటారు టీడీపీ వారు.
ఏది ఏమైనా ఇన్నాళ్ల పాటు వీడియోలు చేస్తూ వచ్చిన కిరణ్ చేబ్రోలు ఒక్కసారిగా అరెస్టులు, కేసులు అంటూ లైమ్ లైట్లోకి వచ్చేశారు. అంటే ఇందుకు కారణం బూతు. ఈ బూతు వెనక దాగిన అసలు సృష్టికర్త వైయస్ జగన్. ఆయన.. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా.. పోలీసుల పట్ల గౌరవంగా మాట్లాడి ఉంటే ఎవరికీ ఏ అభ్యంతరం అనిపించేది కాదు.
ఒక రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి అయి ఉండి కూడా.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననే కామెంట్లు చేయడంతోనే ఒక్కసారిగా కాక చెలరేగింది. దీనిపై తనదైన సహజ ధోరణిలో బూతు దట్టించి వదిలారు కిరణ్ చేబ్రోలు. అప్పటికీ కిరణ్ తన తప్పు తెలుసుకుని.. క్షమాపణలు కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు కూడా. అయినప్పటికీ వదలని పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. ఇలాంటి బూతు భువనేశ్వరిపై చేసినా, భారతీరెడ్డిపై చేసినా సహించేది లేదన్న క్లియర్ కట్ మెసేజ్ పాస్ చేశారు.
ఇటీవల అలేఖ్య చిట్టీ అనే పచ్చళ్లు అమ్మే అమ్మాయిల ఉదంతంలోనూ బూతు పాత్ర అత్యంత కీలకంగా కనిపించింది. మీ పచ్చళ్లు మరీ ఇంత రేటా? అని ఒక కస్టమర్ అడిగినపుడు.. తాము వాడే వస్తువులు అంత నాణ్యమైనవని చెప్పకుండా అలేఖ్య చిట్టీ విపరీతమైన బూతును మిళితం చేసిన భాష వాడింది. ఇది ప్రస్తుతం ఆమెను, ఆమె ఇద్దరు సోదరీమణులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది.
ఒక రకంగా చెబితే... ఈ బూతులకు బాగా అలవాటు పడ్డారు సామాన్యులు. ఇప్పటి వరకూ తెరకు దూరంగా ఉంటూ వచ్చిన బూతు.. సోషల్ మీడియా జమానాలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తద్వారా అదొక మాస్ లాంగ్వేజీగా అవతరించింది. ఎవరు బూతులు మాట్లాడుతారో వారిని విపరీతంగా ఫాలో కావడం యూత్ ఒక పనిగా పెట్టుకుంది.
శ్రీరెడ్డి విషయానికి వస్తే.. శ్రీరెడ్డి బేసిగ్గా ఒక వైసీపీ సపోర్టర్. ఆమె భాష ఎంతో విధ్వంసకరంగా ఉంటుంది. లైవ్ లో అయితే తన రేటుతో సహా చెప్పేస్తూ.. తన ఫాలోయర్స్ ని ఊరించి వదిలిపెడుతుంది. ఆమె వంట వీడియోలు చేసినా.. అందులోనూ బూతు ప్రదర్శన చేస్తూ.. హల్ చల్ చేస్తుంది.
ఆ మాటకొస్తే ఇటీవల ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న కూడా బూతులతో తన రాజకీయ, సోషల్ మీడియా కోటగోడలు నిర్మించుకున్నవాడే. బాతాల పోశెట్టి వంటి ఎన్నో బూతు మాటలతో సీఎం స్థాయి వ్యక్తిపై తీవ్ర పరుష పదజాలం వాడి జనాల్లోకి వెళ్లాడు. వారిని విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇవాళ ఇదిగో ఎమ్మెల్సీ గా ఎదిగాడు. అలాగని తన భాషను కంట్రోల్ చేశాడా అంటే అదీ లేదు. తాజాగా రెడ్లు, వెలమలపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటి వేయబడ్డాడు.
ఒకరు సాధారణ పార్లమెంటు భాషలో ప్లెయిన్ లాంగ్వీజీలో మాట్లాడితే.. వారి భాషనెవరూ స్వీకరించడం లేదు. ఆదరించడం లేదు. ఎవరైతే రిస్క్ తీస్కుని బూతులతో కూడిన అవాకులు చెవాకులు పేలుతుంటారో వారినే హైలెట్ చేస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. వారినే ఫాలో అవుతూ వస్తున్నారు కొందరు. ఇందువల్లే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతెందుకు ఈనాడును, ఈటీవీని ఎంతో సంస్కారవంతంగా నడిపిన రామోజిని సైతం ఈ బూతు జబర్దస్త్ రూపంలో చొరబడి బోల్తా కొట్టించిందని అంటారు.
జబర్దస్త్ లో స్కిట్లలో వాడే భాష మొత్తం దాదాపు బూతు పదజాలంతో కూడుకుని ఉంటుంది. అది హిట్ కావడం, ఏళ్ల తరబడి కొనసాగుతుండటంతో.. బూతు ఒక మార్కెట్ వస్తువుగా తయారైంది. సాధారణ లాంగ్వేజీతో మాట్లాడే ఏ ఇన్ ఫ్లుయెన్షర్ కి కూడా పెద్దగా ఫాలోయర్లుండరు. అదే బూతు పదజాలం విస్తృతంగా ఎవరు వాడుతారో.. వారి చుట్టూ ఫాలోయర్లు మూగిపోతున్నారు. దీంతో బూతు మార్కెట్ స్ట్రాటజీలోనే టాప్ ప్లేస్ లోకి చేరిపోయింది.
కిరణ్ చేబ్రోలు మొన్నటి వరకూ చేసిన కామెంట్లు ఎవరికీ పెద్దగా తెలీవు. ఏదో పార్టీ వాయిస్ వినిపిస్తున్నాడ్లే అనుకున్నారు. ఎప్పుడైతే జగన్ తనదైన శైలిలో పోలీసుల బట్టలు విప్పారో. దాని ప్రేరణతో కిరణ్ చేబ్రోలు ఆయన సతీమణి భారతి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో.. ఆ వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసిపోయారు. ఇవాళ కిరణ్ చేబ్రోలో ఒక పాపులర్ సెలబ్రిటీ హోదా సాధించారు. అది మంచా చెడ్డా చూడ్డం లేదు జనం. పాపులర్ అయ్యాడా లేదా చూస్తున్నారు.
గతంలో ఇదే వైసీపీకి సంబంధించిన వల్లభనేని వంశీ, నారా భువనేశ్వరిని అనరాని మాటలు అనడం వల్లే కదా? చంద్రబాబు ఆనాడు సభను వీడింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్క వంశీయే కాదు.. కొడాలి నాని కూడా చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని తీవ్ర పరుష పదజాలంతో దూషించేవారు. వీరికి రోజా, అంబటి, అనిల్ వంటి వారు తానతందాన అనేవారు. వీరు చేసే అనుచిత వ్యాఖ్యలను నాటి వైసీపీ ప్రభుత్వం ఎంత మాత్రం కట్టడి చేసేది కాదు. పైపెచ్చు వారిని మరింతగా రెచ్చగొట్టేది. ఇలాంటి వాటికంటూ సజ్జల పుత్రరత్నం భార్గవ్ చేత ఒక యూనిట్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా.. వీటిని విపరీతంగా ప్రచారం చేయించేవారు.
ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా తీర్చిదిద్దిందే వైసీపీ. దాని సోషల్ మీడియా విభాగం. పైకి టీడీపీ దాని అనుకూల మీడియా ఎంత బలంగా కనిపించినా.. వైసీపీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా కూడా చూపలేని, చెప్పలేని ఎన్నో విషయాలను జనాల్లోకి తీస్కెళ్లి అలజడి చెలరేగేలా చేసేది. ఈ విపరీత ధోరణే ప్రస్తుం వైసీపీకి చేటు తెచ్చింది. 11 సీట్లకు పరిమితం చేసింది. ఇంకా ఇదే పంథాలో వెళ్తే.. ఈ మాత్రం సీట్లు కూడా రావన్న సంకేతాలు అందుతున్నాయ్. మరి చూడాలి వైసీపీ ఈ బూతు ప్రేరేపిత విధానం ఎప్పుడు ఎలా ఆపుతుందో లేదో తేలాల్సి ఉంది.