వయనాడ్‌లో ప్రియాంక ఓడిపోతారా?
posted on Jun 15, 2024 3:47PM
కేరళలోని వయనాడ్ పార్లెమెంట్ నియోజకవర్గం నుంచి ప్రియాంకా వధేరా ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారట. ఇది చాలా అద్భుతమైన విషయమని, ప్రియాంకా వధేరా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోతుందని, అందువల్ల వయనాడ్ ప్రజలందరూ ఎగిరి గంతులు వేసి పండగ చేసుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.
ఇంతకీ వయనాడ్ నియోజకవర్గానికి ఎందుకు ఉప ఎన్నిక రాబోతోంది? ఎందుకంటే, ఇక్కడ నుంచి ఎన్నికైన రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి. రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికలలో తన కుటుంబ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. గత ఎలక్షన్స్.లో అమేథీ నుంచి ఓడిపోయినట్టుగానే ఇక్కడ కూడా ఓడిపోతానేమోనే భయంతో సేఫ్ సైడ్‌గా తనకు గతంలో్ విజయాన్ని ఇచ్చిన వయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పో్టీ చేసేవారిని ఓడించాలనే జ్ఞానం తెలంగాణలోని కామారెడ్డి ఓటర్లకు బాగా వుంది. అందుకే, కామారెడ్డిని తమ రెండో స్థానంగా ఎంచుకుని పోటీ చేసిన కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడించారు. ఈపాటి జ్ఞానం లేకపోవడం వల్ల వయనాడ్ నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీని రెండోసారి కూడా గెలిపించారు. అలా గెలిపించిన వయనాడ్‌కి బైబై చెప్పేసి రాహుల్ గాంధీ రాయబరేలి ఎంపీగానే మిగలనున్నారు. వయనాడ్ ప్రజలు ఫీలవకుండా వుండటం కోసం ఉప ఎన్నికలో ఇక్కడ నుంచి ప్రియాంకా రాబర్ట్ వధేరాని నిలపాలని అనుకుంటున్నారు.
ఇంతకీ రాహుల్ గాంధీ సేఫ్ సైడ్‌గా పోటీ చేయడానికి వయనాడ్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే, వయనాడ్ నియోజకవర్గం ఆంగ్లో ఇండియన్ల ప్రభావం వున్న నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువశాతం క్రైస్తవులే వుంటారు. తల్లి వైపు నుంచి క్రైస్తవం వున్న రాహుల్ గాంధీకి ఇంతకంటే సేఫ్ నియోజకవర్గం మరొకటి వుంటుందా?
రాహుల్ గాంధీని కష్టకాలంలో ఆదుకున్న నియోజకవర్గం వయనాడ్. అలాంటి ఈ నియోజకవర్గం ఒక్కదాంట్లోనే ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేసి వుండవచ్చు కదా? అదనంగా రాయబరేలి నుంచి కూడా ఎందుకు పోటీ చేశారు? వయనాడ్‌లో ఓడిపోతానని భయపడ్డారా? అంత నమ్మకంగా తనను గెలిపించిన వయనాడ్ మీద రాహుల్ గాంధీకి ఎందుకు అంత అపనమ్మకం కలిగింది? అలాంటి అపనమ్మకం ఏదో కలిగినప్పుడు, వయనాడ్‌ని వదిలేసి తన కుటుంబ నియోజకవర్గం రాయబరేలి ఒక్కదాంట్లోనే పోటీ చేసినట్టయితే, వయనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖర్చుల ప్రజాధనం వృధా కాకుండా వుండేది కదా? వయనాడ్ నియోజకవర్గం ఆటలో అరటిపండు నియోజకవర్గంలాగా దేశం ముందు నిలబడి వుండేది కాదు కదా?
ఇంతా చేసి, ఇప్పుడు మళ్ళీ వయనాడ్ నియోజకవర్గానికి ప్రియాంకని పంపించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. తమను అవమానించిన రాహుల్ గాంధీ కుటుంబ సభ్యురాలినే మరోసారి గెలిపించాల్సిన అవసరం వయనాడ్ నియోజకవర్గానికి ఏముంది? రాహుల్ గాంధీ చేసిన పనికి మనసులో కోపం పెట్టుకున్న వయనాడ్ ఓటర్లు ఈసారి ఉప ఎన్నికలో ప్రియాంకని ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.