పుంగనూరులో పెద్దిరెడ్డి సీన్ రివర్స్!

పుంగనూరులో పెద్దరెడ్డి సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవలి ఎన్నికలలో పుంగనూరు నుంచి చావు తప్పి కన్నులొట్టబోయిన చంద్రంగా విజయం సాధించినా నియోజకవర్గంపై ఆయన పట్టు మాత్రం పూర్తిగా సడలిపోయింది. నియోజకవర్గంలోకి అడుగుకూడా పెట్టలేని దయనీయ స్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవుతాయంటారు. పుంగనూరులో తనకు తిరుగులేదు అన్నట్లు వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పది రోజుల్లో సీన్ రివర్స్ అయ్యింది. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేక చివరి నిముషంలో తన పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది. గత ఐదేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో... ఒక్క పుంగనూరు అనేమిటి మొత్తం చిత్తూరు జిల్లాలోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. 

  అయితే ఒక్క పది రోజుల్లో ఆయన పరిస్ధితి తల్లకిందులైంది. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ హయాంలో ఐదేళ్లూ మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా పెత్తనం చెలాయించారు. స్థాయి మరిచి  పెద్ద పెద్ద సవాళ్లు విసిరారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో దౌర్జన్యాలు, డబ్బుతో వైసీపీకి విజయం దక్కేలా చేశారు.

దీంతో జగన్ వైనాట్ కుప్పం అంటూ విర్రవీగారు. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబునాయుడు 48వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆయనకు వచ్చిన మెజారిటీ కంటే 18 వేల ఓట్లు మెజారిటీ అధికంగా వచ్చింది. అదే సమయంలో పుంగనూరు నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కేవలం 6, 619 ఓట్ల మెజారిటీతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. ఇక ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి 76వేల 71 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ విజయం ఏమీ ఆయన గొప్పతనం కాదు. రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి ఉంటే మిథున్ రెడ్డి గెలిచే అవకాశమే ఉండేది కాదు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడంతో అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పలువురు లోక్ సభ నియోజకవర్గం దగ్గరకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో మిథన్ రెడ్డి గట్టెక్కారు. 

ఇక విషయానికి వస్తే... చంద్రబాబునాయుడిని కుప్పంలో అడుగుపెట్టనీయను అని విర్రవీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గమైన పుంగనూరులో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. శనివారం (జూన్ 15) ఆయన పుంగనూరులో పర్యటించాల్సి ఉండగా తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి గో బ్యాక్ పెద్దిరెడ్డి అన్న నినాదాలతో ఆందోళనకు దిగారు. దీంతో చివరి నిముషంలో పెద్దిరెడ్డి తన పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu