వరంగల్ ఉపఎన్నిక.. రెండింటిలోనూ బీజేపీ తప్పుచేసిందా?

వరంగల్ ఉపఎన్నిక పోరు ముగిసింది. ఇక ఫలితాలు ఒక్కటే తేలాల్సి ఉంది. రేపటితో ఎలాగూ ఫలితాలు తెలుస్తాయి కాబట్టి గెలుపెవరిది అన్న విషయం కూడా తేలిపోతుంది. అయితే ఈ ఎన్నికలో మాత్రం బీజేపీ ఓట్లు గణనీయంగా తగ్గిపోయానని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. కనీసం బీజేపీ ఓట్ల బ్యాంకును కూడా కాపాడుకోలేకపోయామని నేతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. దీనికి కారణం.. పోటీలో నిల్చున్న అభ్యర్ధి.

అసలు వరంగల్ ఉపఎన్నిక అన్నప్పటినుండే బీజేపీ తమ పార్టీ తరుపున అభ్యర్ధిని నిలబెట్టాలని ఎంతగానో పట్టుబట్టింది. మొదట టీడీపీ నేతలు కూడా తమ పార్టీ నేతను పోటీలో నిలబెట్టాలని పట్టుబట్టినా చివరికి మిత్రధర్మం అనే సెంటిమెంట్ తో బీజేపీకే అవకాశం ఇచ్చింది. దీంతో బీజేపీనే తమ అభ్యర్ధిని బరిలో దించింది. అయితే బీజేపీకి ఆ అవకాశం ఇచ్చినా దానిని సరిగా ఉపయోగించుకోలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ కాస్త తడబడిందనే చెప్పాలి.  అసలు ఈ సీటును ఎవరికి ఇస్తారనే విషయంలో మిత్రపక్షమైన టీడీపీకి సైతం చివరివరకు క్లారిటీ ఇవ్వని బీజేపీ నేతలు.. ఇక్కడ ఉన్న పార్టీ నేతలకు కాకుండా ఎక్కడో ఉన్న దేవయ్య అనే ఎన్నారైకు సీటు ఇచ్చింది. దీనిపై మొదట పార్టీ నేతలు కూడా అభ్యంతరం తెలియజేశారు. ఇక్కడ ఉండే నాయకుడికి సీటు ఇవ్వాలని సూచించారు. అయినా బీజేపీ నేతలు మాత్రం అవేమి పట్టించుకోకుండా దేవయ్యకే సీటు ఇచ్చారు. సీటు సంగతి సరే కనీసం ప్రచారంలో కూడా టీడీపీని కలుపుకుపోవడంలో బీజేపీ విఫలమైనట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఎన్నికలో బీజేపీ ఓట్లపై కాస్త అనుమానం వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పటివరకు మూడో స్థానంలో ఉంటుందని భావిస్తున్న బీజేపీ టీడీపీ కూటమి… నాలుగో స్థానానికి పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదని ఎన్నికలు జరిగిన తీరును బట్టి కొందరు బీజేపీ నేతలే అనుకోవడం ఆశ్చర్యకరం. మొత్తానికి అభ్యర్ధి విషయంలో.. అలాగే ప్రచారంలో కూడా బీజేపీ సరైన దిశగా వెళ్లకుండా తప్పుచేసినట్టు తెలుస్తోంది. మరి ఏమవుతుందో తెలియాలంటే రేపటి ఫలితాల వరకూ ఆగాల్సిందే.