కొత్త ఓటరు కార్డులు వస్తాయోచ్
posted on May 15, 2015 10:51PM

మీకు ఓటుందా? మీ దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు వుందా? ఆ ఓటర్ గుర్తింపు కార్డు బ్లాక్ అండ్ వైట్‌లో వుందా? రాబోయే రోజుల్లో మీ ఓటర్ గుర్తింపు కార్డు రంగుల్లో కళకళలాడబోతోంది. ఇప్పుడు మీ కార్డు మీద అస్పష్టంగా వున్న మీ ఫొటో ఫ్యూచర్లో రంగుల్లో కళకళలాడనుంది. తళతళ మెరవనుంది. ఈ కార్డులు మీ చేతికి ఎప్పుడు వస్తాయో డేట్ అడిగితే చెప్పలేంగానీ, సాధ్యమైనంత త్వరలో ఆ కార్డులు మీకు అందుతాయి. అయితే గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడానికి మధ్యలో ఒక దశ వున్నట్టే మీ ఓటర్ గుర్తింపు కార్డులు కొత్త అవతారం ఎత్తడానికి కూడా మధ్యలో ఒక దశ వుంది. ఆ దశ పేరే ‘ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడం’. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే, ఈ రెండు రాష్ట్రాల్లో డబుల్ ఓట్లు దాదాపు పాతిక లక్షలు వున్నాయట. కొందరు కావాలని రెండు చోట్ల ఓటరుగా పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళు అయితే, మరికొందరు అడ్రస్ మారగానే కొత్తగా పేరు నమోదు చేయించుకున్నవారు. ఇలా రెండు చోట్ల ఓటు వున్నవారి ఓటును ఒక్కదానికే పరిమితం చేయడానికి ఎన్నికల కమిషన్ ఓటర్ కార్డుకు, ఆధార్ కార్డుకు లింకు పెట్టింది. ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది. కొంతమంది ఆన్‌లైన్లో ఈ అనుసంధానం పూర్తి చేసుకున్నారు. ఇంకా చాలా చోట్ల ఇలా అనుసంధానం జరగాల్సి వుంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 75 శాతం అనుసంధానం పూర్తయిందని చెబుతోంది. వందశాతం పూర్తికాగానే ఆధార్ నంబర్‌తో కూడిన ఓటర్ కార్డులను జారీ చేస్తారట. ఇటీవలి కాలంలో కలర్ ఓటర్ కార్డులనే జారీ చేస్తున్నారు. దాంతో సహజంగానే ఆధార్ అనుసంధానం పూర్తయిన తర్వాత జారీ చేసే కార్డులు కూడా కలర్ కార్డులు అయ్యే అవకాశం వుంది. కాబట్టి పౌరుల చేతులకు కలర్ ఓటర్ ఐడీ కార్డులు వచ్చే అవకాశం వుంది. పౌరులకు కలర్ కార్డులతోపాటు పౌరుల జీవన ప్రమాణాలు కూడా కలర్‌ఫుల్‌గా మారగలిగితే ఎంత బావుంటుందో.