వైసీపీ నుంచి జంపింగుల జాబితాలో విజయసాయి రెడ్డి కూడా?
posted on Dec 13, 2024 6:56AM
అందరూ అనుకున్నదే జరుగుతోంది. వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఆ పార్టీకి తగిన శాస్తి జరుగుతోంది. ఐదేళ్ల అరాచక పాలన ఫలితం కర్మ రూపంలో ఇప్పుడా పార్టీని ఖాళీ చేస్తోంది. ఇంకా జగన్ తో కలిసి నడిస్తే పుట్టగతులుండవన్న భయంతో ఇంత కాలం జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు కూడా జాగ్రత్తపడుతున్నారు. జగన్ కు దూరం జరుగుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. కూటమి పార్టీల్లోని ఏదో ఒక పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. అందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీలోనూ అవకాశం లభించకపోతే.. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండి.. తరువాతెప్పుడో అవకాశం చూసుకుని ఏదో ఒక పార్టీ పంచన చేరుదాం అన్న ఉద్దేశంతో వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, నేతలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు.
మాజీ మంత్రి అందతి శ్రీనివాస్ వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదనీ, జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయిందనీ, కొత్త ప్రభుత్వంపై మొదటి రోజు నుంచే దాడి కరెక్ట్ కాదనీ, కూటమి ప్రభుత్వానికి ఏడాదైనా టైమ్ ఇవ్వాల్సిందనీ అన్నారు. అక్కడితో ఆకకుండా కూటమి సర్కార్ పాలన భేషుగ్గా ఉందంటూ పోగడ్తలు గుప్పించారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన మరో నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా జగన్ పై, వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోటరీకి తాను ఎదగడం ఇష్టం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తే పవన్‌ను పెద్ద నాయకుడిని చేసినట్టు అవుతుందని భావించి మంత్రి పదవి ఇవ్వలేదని గ్రంధి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసిన ఈ ఇద్దరూ కూడా తాము ఏపార్టీలో చేరతామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
అదలా ఉంచితే... జగన్ మరో భారీ షాక్ కు సిద్ధమవ్వాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ సీనియ ర్ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితుడు, వైసీపీలో ఒకప్పటి నంబర్ 2 నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జగన్ కు, వైసీపీకీ గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారు. రాజకీయవర్గాలు, పరిశీలకులు మాత్రమే కాదు, వైసీపీ వర్గాలు సైతం విజయసాయి వైసీపీని వీడేందుకు సిద్ధమౌతున్నారని అంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే..అందుకు విజయసాయి పోషించిన కీలక పాత్ర విస్మరించలేనిది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, బీజేపీ అగ్ర నేతలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉండేలా జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు విజయసాయి. విజయసాయి రెడ్డి కృషితోనే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి బీజేపీ సహకారం అందించిందని వైసీపీలోని పలువురు నేతలు గతంలో బాహాటంగానే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అధికారం కోల్పోయిన తరువాత కూడా బీజేపీ అగ్ర నేతలు, జగన్ కు మధ్య విజయసాయి రెడ్డి రాయభారిగా ఉంటూ ముఖ్యమైన పనులు చక్కబెడుతున్నారని ప్రచారం జరుగు తున్నది. ముఖ్యంగా ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా ఎదురయ్యే ఇబ్బందుల నుంచి కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు జగన్‌కు, తనకు రక్షణగా నిలిచేలా విజయసాయి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కౌపీన సంరక్షణార్దం అన్నట్లుగా జగన్ లో కలిసి నడిచి నిండా మునిగిపోవడం కంటే ఆయన వదిలేసి సేఫ్ గూటికి చేరడానికి సైతం విజయం సాయి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం వద్ద పలుకుబడి ఉన్న నేపథ్యంలో విజయసాయి.. జనసేన అయితే తనకు సేఫ్ హౌస్ అవుతుందని భావిస్తున్నారని, అందుకే బీజేపీ పెద్దలతో తన కున్న సంబంధాల ద్వారా జనసేనలోకి దూకేయడానికీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకముందు.. సీఎం అయిన తరువాత కొద్దిరోజులు ఆయనకు రైట్ హ్యాడ్‌గా ఉన్న విజయ సాయిరెడ్డికి ఆ తరువాత పార్టీలో ఆ ప్రాధాన్యత లేకుండా పోయింది. అంతకుముందు అక్రమాస్తుల కేసుల్లో జగన్ తో పాటు విజయసాయి కూడా జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తరువాత క్రమంగా విజయసాయిరెడ్డిని దూరం పెడుతూ వచ్చారు. ఆయన సలహాలు, సూచనలను జగన్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని అప్పట్లో వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.
విజయసాయి రెడ్డి ఓ మీడియా ఛానల్ పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం, కేంద్రంలోని బీజేపీ పెద్దలతో తనకున్న సంబంధాల ద్వారా మీడియా ఛానల్ ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియను మొదలు పెట్టడమే జగన్ రెడ్డి ఆగ్రహానికి కారణం అంటారు. పార్టీకి సొంత మీడియా ఉండగా.. మరో మీడియా ఛానెల్ పెట్టేందుకు విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలను జగన్ తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు.. బీజేపీ అగ్రనేతలతో పలుసార్లు తనకు తెలియకుండానే రహస్యంగా విజయసాయిరెడ్డి సమావేశం కావడం పట్ల జగన్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతారు. అప్పటి నుంచే విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని కొందరు వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే, ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి మళ్లీ జగన్‌కు విజయసాయిరెడ్డి దగ్గరయ్యారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు, రాసలీలల వ్యవహారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో జగన్, ఆయన సొంత మీడియా పెద్దగా పట్టించుకోలేదన్న ఆగ్రహంతో విజయసాయిరెడ్డి రగిలిపోయాడు. దీనికితోడు తాజాగా అరబిందో పేరుతో ఏపీలో చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో విజయసాయిరెడ్డి కీలక సూత్రదారిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెండ్, కాకినాడ సెజ్‌లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనా సీఐడీ కేసు నమోదు చేసింది. దీనికితోడు వారు విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్‌వోసీ) జారీ చేసింది. త్వరలో విజయసాయిరెడ్డి క్రిమినల్ రాజకీయానికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయని, ఆయన శాశ్వతంగా జైలుకెళ్లడం ఖాయమన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున మొదలైంది. దీంతో విజయసాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శరణు కోరారు. ఇటీవల విజయసాయి అమిత్ షాను కలిసి తనను కేసుల నుంచి బయటపడేయాలని వేడుకున్నారనీ, ఆయన సూచన మేరకు పవన్ కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి విజయసాయిరెడ్డి నానా పాట్లూ పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును విమర్శిస్తూనే పవన్ కళ్యాణ్‌పై విజయసాయి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్‌కు జాతీయ స్ధాయిలో ప్రజాదరణ ఉందనీ ఏపీకి నాయకత్వం వహించడానికి పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి అని తాను భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేవలం అంతటితో ఆగకుండా... ఏపీలోని కూటమి నాయకుల్లో పవన్ అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి అని సాయిరెడ్డి ఆకాశానికి ఎత్తేశారు. ఏపీ వంటి కొత్త రాష్ట్రానికి ఏడుపదుల వయస్సు పైబడిన చంద్రబాబు నాయకత్వం కంటే పవన్ వంటి యువ నాయకత్వం అవసరమని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన పార్టీలో చేరుతాననీ, తన వెంట భారీ ఎత్తున వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరుతారని విజయసాయిరెడ్డి పవన్ కల్యాణ్ వద్దకు రాయబారం నడుపుతున్నారని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.