కాంగ్రెస్ లోకి విజయమ్మ అడుగు.. జగన్ నెత్తిన పిడుగు

ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా త‌ప్పద‌న్నా..  చేసిన పాపాలకు  అస‌లు వ‌డ్డీతో టి సిస‌లుగా ఫ‌లితంబు అనుభ‌వించుట త‌ధ్య‌మ‌న్నా.. అంటూ సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది.  జీవితంలో మ‌నంచేసే మంచి చెడుల‌కు ఫ‌లితాలు త‌ప్ప‌కుండా అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని  దీని సారాంశం.   ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి  అతికినట్లు సరిపోతుంది. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. త‌న మాట‌కు అడ్డుచెప్పిన వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి రాక్ష‌సానందం పొందారు. ఈ కోవ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని నేత‌లే కాదు.. సొంత పార్టీలోని కొంద‌రు నేత‌లు సైతం జ‌గన్ బాధితులుగా మారిపోయారు. వీరితో పాటు సొంత తల్లి, చెల్లిని సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమానించారు. ఫ‌లితంగా సొంత చెల్లి, త‌ల్లిసైతం జ‌గ‌న్ పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. త‌ప్పుల‌కు త‌ప్ప‌నిస‌రిగా దండ‌న ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మితో దెబ్బ‌తిన్న జ‌గ‌న్‌కు.. వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రావ‌టానికి వైఎస్ ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ కూడా ఓ కార‌ణం. అదే స‌మ‌యంలో 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మికి కూడా వారిద్ద‌రూ ఓ కార‌ణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా త‌న రాజ‌కీయ అడుగులు వేశారు. ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌మ్మ‌ నిలిచారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులూ త‌ల్లి, చెల్లి విలువ‌ను గుర్తించ‌లేని జ‌గ‌న్‌.. ఇప్పుడు వారిని మ‌చ్చిక చేసుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్ ష‌ర్మిల జ‌గ‌న్ ద‌రిదాపుల్లోకి వెళ్లేందుకు  ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇటీవ‌ల స‌యోధ్య‌ కోసం జ‌గ‌న్ మ‌ద్ద‌తుదారులు ప్ర‌య‌త్నించ‌గా.. ష‌ర్మిల ఛీకొట్టిన‌ట్లు స‌మాచారం. దీనికి తోడు ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జులై 8వ తేదీన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌యంతి. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ వేదికగా  కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ష‌ర్మిల నిర్ణయించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేత‌ల‌తోపాటు, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేత‌ల‌ను స్వ‌యంగా వెళ్లి  మరీ ష‌ర్మిల ఆహ్వానించారు.

ష‌ర్మిల నిర్వ‌హించే వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయితే వైసీపీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీనికి తోడు గ‌త ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హాలో పాల‌న అందించ‌లేకపోయాడు. దీంతో వైఎస్ఆర్ అభిమానులుసైతం జ‌గ‌న్ పై ఆగ్ర‌హంతో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ పాల‌న మ‌ళ్లీ రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని వైఎస్ జ‌యంతి కార్య‌క్ర‌మం వేదిక‌గా ష‌ర్మిల ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌లంగా చెప్ప‌బోతున్నారు. ప్ర‌జ‌లు ష‌ర్మిల మాట‌ల‌ను విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్ పార్టీ మ‌నుగ‌డ  క‌ష్ట‌మేన‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ష‌ర్మిల దూకుడుకు త‌ల ప‌ట్టుకుంటున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌ నెత్తిన మ‌రో పిడుగు పడింది.  ష‌ర్మిల నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. తద్వారా తాను వైసీపీకి కాదు కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నానని చెప్పకనే చెప్పడానికి నిర్ణయించుకున్నారని తేటతెల్లమౌతోంది. 

ష‌ర్మిల నిర్వ‌హించేది పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమం. అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేతలను ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కలిసి కోరారు.   ష‌ర్మిల నిర్వ‌హించే వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మానికి విజయమ్మ హాజర‌యితే.. అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే. కొంతకాలంగా  విజయమ్మ రాజకీయంగా షర్మిలకే  అండగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగే వైఎస్  జ‌యంతి కార్య‌క్ర‌మంలో విజ‌య‌మ్మ పాల్గొంటే.. రాష్ట్రంలో వైసీపీని కాదని కాంగ్రెస్ ను బలపరచాలని విజయమ్మ పిలుపునిచ్చినట్లే అర్ధం.   అంటే ఏపీలో వైసీపీ భూస్థాపితానికి బీజం ప‌డిన‌ట్లే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను చూస్తున్న ఏపీ ప్ర‌జలు.. ఎవ‌రు చేసిన క‌ర్మ వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు.. అంటూ సాగే పాట‌ను గుర్తు చేసుకుంటున్నారు.