ఉన్నావ్ దోషి భార్యకు బీజేపీ టికెట్

అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు.

ఉన్నావ్ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైనర్ బాలికపై అత్యా.చార కేసులో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ దోషిగా తేలారు. 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. అయితే, ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్య బీజేపీ తరపున పోటీచేయబోతున్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు యూపీ పంచాయితీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ టికెట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు. 

రే-ప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి భార్యకు టికెట్ ఇవ్వడాన్ని కమలనాథులు నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ‘‘కుల్‌దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఆయన జైల్లో ఉన్నారు. కుల్దీప్ చేసిన నేరాలకు అతడి భార్యను శిక్షించకూడదు. సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చాం. ఇప్పటికే ఆమె ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలి తప్ప.. నేరస్తుడి భార్య కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడదు.’’ అంటున్నారు. తప్పు చేసినా పర్వాలేదు.. గెలిచే సత్తా ఉంటే చాలు అన్నట్టుగా బీజేపీ తీరు ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు.