ఈట‌ల‌కు మ‌ళ్లీ నోటీసులు.. భూముల‌ స‌ర్వేతో క‌ల‌క‌లం..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు. 

బీజేపీ నేత,  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్‌ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న స‌ర్వేకు హాజ‌రుకావాల‌ని ఈట‌ల రాజేంద‌ర్‌ స‌తీమ‌ణి జ‌మునారెడ్డి, కుమారుడు నితిన్‌రెడ్డిల‌కు తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. 

మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్‌పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కొవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 18న స‌ర్వే జ‌రిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు అధికారులు.