నిరుద్యోగంతో ఆరోగ్యమూ గల్లంతు


నిరుద్యోగంతో మనిషి మనసు క్రుంగిపోతుందనీ, ఆత్మన్యూనతతో బాధపడే ప్రమాదం ఉందని తెలిసిందే! కానీ వారి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. Gallup-Healthways అనే సంస్థ రూపొందించిన నివేదికలో నిరుద్యోగానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

 

50 ఏళ్లవారితో సమానం

30 ఏళ్లలోపు ఎలాంటి ఉద్యోగమూ లేనివారి ఆరోగ్యం 50 ఏళ్లు పైబడిన పెద్దలతో సమానంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు వారు 2013-2015 మధ్యకాలంలో 155 దేశాలకు చెందిన దాదాపు 4,50,000 మందిని పరిశీలించారట. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఎక్కువ చదువు ఉండి నిరుద్యోగంతో బాధపడేవారి ఆరోగ్యం మరింత అల్పంగా ఉండటం. ఉదాహరణకు డిగ్రీ పట్టా పొందిన నిరుద్యోగులలో 86 శాతం మందిలో ఏదో ఒక అనారోగ్య సమస్య కనిపిస్తే, ప్రాధమిక విద్య మాత్రమే అర్హతగా ఉన్నవారిలో ఇది 72 శాతమే ఉంది.

 

అమెరికాలోనే ఎక్కువ

మిగతా దేశాలతో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ నిరుద్యోగపు అనారోగ్యం ఎక్కువగా ఉండటం పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది. స్పెయిన్‌ యువతలో 40 శాతానికి పైగా నిరుద్యోగంతో బాధపడుతున్నారు, అదే అమెరికాలో అయితే కేవలం 11 నుంచి 12 శాతమే నిరుద్యోగం కనిపిస్తుంది. పైగా స్పెయిన్‌ పేదరికంతో కూడా కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అలాంటి దేశాలతో పోల్చుకుంటే అమెరికా నిరుద్యోగులలో అనారోగ్యం ఎక్కువగా కనిపించిందట. కేవలం అమెరికాలోనే కాదు... ప్రపంచ బ్యాంకు ధనిక దేశాలు అంటూ ముద్రవేసిన చాలా దేశాలలో ఈ తేడా కనిపించింది.

 

కారణాలు

నిరుద్యోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేందుకు తగినంత ఆర్థిక వనరులు ఉండవన్నది మొదటగా తేలిపోయే కారణమే! కానీ ధనికదేశాల్లో ఈ వ్యత్యాసం ఎందుకని ఎక్కువగా ఉంటుందన్నదానికి కొన్ని ఆశ్చర్యకరమైన విశ్లేషణలు వెలువడ్డాయి.

 

- ధనికదేశాలలోని ఖర్చులు, ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బున్నవారికి మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఖర్చులను నిరుద్యోగులు భరించడం చాలా కష్టంగా మారిపోతుంది.

 

- భారతదేశం, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని కుటుంబ జీవనం అమెరికా వంటి ధనిక దేశాలకు కాస్త విరుద్ధంగా ఉంటుంది. మన దేశంలో 99 శాతం యువతకి తమ కుటుంబాలు అండగా ఉన్నాయి. వారు వారి కుటుంబాలతో కలిసే ఉంటారు. కానీ అమెరికాలో మాత్రం 26 శాతం మంది యువత తమ కుటుంబాల నుంచి విడివడి విడిగా బతికేస్తున్నారు. దాంతో వారి బాగోగులను చూసుకునేందుకు, ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండేందుకు ఎవ్వరూ లేకుండా పోతున్నారు.

 

- నిర్జర.